
ఆసియాకప్-2025 వేదికలు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించి షెడ్యూల్‌ను విడుదల చేసిన ఆసియా క్రికెట్ కౌన్సిల్.. తాజాగా మ్యాచ్‌లు జరిగే వేదికలను ప్రకటించింది. ఈ మెగా టోర్నమెంట్ యూఏఈలోని అబుదాబి, దుబాయ్ వేదికలగా జరగనున్నట్లు ఏసీసీ వెల్లడించింది.
ఈ ఆసియాకప్‌లో 11 మ్యాచ్‌లు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, మరో 8 మ్యాచ్‌లు అబుదాబి ఇంటర్ననేషనల్ మైదానంలో జరగనున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్న భారత్, పాకిస్తాన్ మ్యాచ్ దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 14న జరగనుంది.
ఈ మెగా టోర్నమెంట్ సెప్టెంబర్ 9న ప్రారంభమై 28న ముగియనుంది. తొలి మ్యాచ్‌లో దుబాయ్ వేదికగా అఫ్గానిస్తాన్, హాంకాంగ్ జట్లు తలపడనున్నాయి. ఇక ఇది ఇలా ఉండగా.. వాస్తవానికి ఈ ఏడాది ఆసియాకప్‌కు భారత్ ఆతిథ్యమివ్వాల్సింది.
కానీ భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ ఈవెంట్‌ను యూఏఈలో నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు పాల్గోనున్నాయి. ఈ జట్లను మొత్తం రెండు గ్రూపులుగా విభజించారు.
ఏ గ్రూప్‌లో ఎవరు?
గ్రూప్ ఎ: భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్
గ్రూప్ బి: శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్ఘానిస్థాన్, హాంకాంగ్
ఆసియా కప్‌లో టీమిండియా షెడ్యూల్..
10 సెప్టెంబర్: భారత్ - యూఏఈ (దుబాయ్)
14 సెప్టెంబర్: భారత్ - పాకిస్తాన్ (దుబాయ్)
19 సెప్టెంబర్: భారత్ - ఒమన్ (అబుదాబీ)
ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశముంది. అయితే ఈ ఆసియా జెయింట్స్ పోరుకు టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి.
చదవండి: IND vs ENG: టీమిండియాతో ఐదో టెస్టు.. 123 ఏళ్ల చరిత్రను ఇంగ్లండ్ తిరగరాస్తుందా?