
Asaduddin Owaisi Slams PM Modi Over India Vs Pakistan T20 World Cup Match: టీ20 ప్రపంచకప్-2021లో దాయాదుల పోరు నేపథ్యంలో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ చర్యల వల్ల సరిహద్దుల్లో మన వాళ్లు ప్రాణాలు కోల్పోతుంటే.. పాక్‌తో టీ20 మ్యాచ్ అవసరమా అని ప్రధానిని నిలదీశారు. పాక్ కేంద్రంగా పని చేస్తున్న ముష్కరులు ఓ పక్క సాధారణ ప్రజలను 20-20 ఆడుకుంటుంటే.. పాక్‌తో టీ20 మ్యాచ్ ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగానే దేశంలో హింస పేట్రేగిపోతుందని ఆరోపించారు. ఈ అంశంపై నిన్న కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో భారత్-పాక్ మ్యాచ్‌పై పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌ల మధ్య అక్టోబర్ 24న జరగాల్సిన మ్యాచ్‌ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు అధికమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా #BanPakCricket హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. మ్యాచ్ రద్దుపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పందించాడు. సామాన్యులపై ఉగ్రదాడులను ఖండిస్తూనే.. మ్యాచ్‌ను రద్దు చేయడం కుదరదని స్పష్టం చేశాడు. ఐసీసీకి ఇచ్చిన కమిట్‌మెంట్ ప్రకారం.. ఏ జట్టుతోనూ మ్యాచ్ ఆడేందుకు తిరస్కరించే వీలులేదని తేల్చి చెప్పారు.
కాగా, దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో ఆదివారం సాయంత్రం ముష్కరులు కాల్పులకు తెగబడి ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు. ఈ నెలలో ఇప్పటి దాకా ఉగ్రదాడులకు 11 మంది సాధారణ పౌరులు బలయ్యారు. స్థానికేతరులు టార్గెట్‌గా ఉగ్రదాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.
చదవండి: 2 ప్రపంచకప్‌లలో 2 వేర్వేరు దేశాలు.. చరిత్ర సృష్టించిన నమీబియా క్రికెటర్