
Mikya Dorgi 1st Bhutan Player Register For IPL Mega Auction 2022.. ఐపీఎల్ అంటేనే క్యాచ్‌రిచ్ లీగ్ అని ముద్ర పడిపోయింది. ఒక్కసారి ఐపీఎల్‌లో పాల్గొంటే చాలు కోట్ల రూపాయలు వెనకేసుకున్నట్లే. మరి ఇంత మంచి అవకాశాన్ని ఏ ఆటగాడైనా ఎందుకు వదులుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడితే రాని గుర్తింపు ఐపీఎల్ ద్వారా తొందరగా వస్తుందని చాలా మంది అభిప్రాయం. అందుకే ఎక్కడున్నా సరే ఐపీఎల్‌లో ఒక్కసారైనా ఆడాలని ప్రతీ ఆటగాడు కోరుకుంటాడు. తాజాగా ఫిబ్రవరి 12,13 తేదీల్లో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే.
ఈసారి వేలంలో దాదాపు 1214 మంది ఆటగాళ్లు తమ పేరును రిజిస్టర్ చేసుకున్నారు. అందులో భుటాన్‌కు చెందిన ఆల్‌రౌండర్ మిక్యో డోర్జీ కూడా ఉన్నాడు,. భుటాన్ నుంచి ఐపీఎల్ వేలంలో పాల్గొంటున్న తొలి క్రికెటర్‌గా నిలవనున్నాడు. వచ్చే నెలలో జరగనున్న వేలంలో మిక్యా డోర్జీ పేరు వినపడనుంది. మరి అతన్ని ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలంటే అప్పటివరకు వేచి చూడాల్సిందే.
ఇదిలా ఉంటే డోర్జీ.. తన ఆరాధ్య క్రికెటర్.. సీఎస్‌కేను నాలుగుసార్లు విజేత గా నిలిపిన ఆ జట్టు కెప్టెన్ ఎంఎస్ ధోనితో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ధోని సంతకం చేసిన జెర్సీని అతని చేతుల మీదుగా అందుకున్న డోర్జీ దానికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాడు. వీడియోలో ధోని మాట్లాడుతూ.. ఈ విషయాన్ని సింపుల్‌గానే ఉంచు. నీ ఆటపైనే దృష్టి పెట్టు.. రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. నీ ప్రక్రియను సరిగ్గా నెరవేర్చు.. ఫలితాలు వెతుక్కంటూ వస్తాయి. ఆటను బాగా ఎంజాయ్ చెయ్.. ఒత్తిడిని దరిచేరనీయకు అంటూ ధోని డోర్జీకి విలువైన సూచనలు ఇచ్చాడు.
ఎవరీ మిక్యా డోర్జీ..
మెగా వేలానికి తమ పేరు నమోదు చేసుకున్న 318 మంది విదేశీ ఆటగాళ్లలో భుటాన్‌కు చెందిన 22 ఏళ్ల ఆల్ రౌండర్ దోర్జీ కూడా ఉన్నాడు. నేపాల్‌లో ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ పేరుతో జరిగిన టోర్నీలో లలిత్‌పూర్ పేట్రియాట్స్‌కు డోర్జీ ప్రాతినిధ్యం వహించాడు. 2018లో మలేషియాపై అరంగేట్రం చేసిన దోర్జీ మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజాగా తన ఆటను ప్రపంచానికి పరిచయం చేసుకోవాలన్న కారణంతో తన పేరును ఐపీఎల్ మెగావేలంలో నమోదు చేసుకున్నాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో డోర్జీ మాట్లాడుతూ.. ''ఐపీఎల్‌లో ఆడాలనేది నా కల. వేలం జాబితాలో భూటాన్‌కు చెందిన ఒక ఆటగాడిని మాత్రమే చూడబోతున్నారు. ఇది ఆరంభం మాత్రమే.. భవిష్యత్తులో మా దేశం నుంచి మరిన్ని పేర్లు వస్తాయి. ఐపీఎల్‌లో పేరు నమోదు చేసుకోవడం నాకు చాలా పెద్ద విషయం'' అని చెప్పుకొచ్చాడు.