David Warner: దెబ్బ అదుర్స్‌.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్‌

David Warner Gives Strong Counter Who-Suffered Most-By-Cricket Australia - Sakshi

గత కొన్నిరోజులుగా ఆస్ట్రేలియా క్రికెట్‌ మీడియాలో డేవిడ్‌ వార్నర్‌ పేరు హాట్‌ టాపిక్‌. కారణం కెప్టెన్సీ విషయంలో క్రికెట్‌ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడమే. 2018లో బాల్‌ టాంపరింగ్‌ వివాదం అతని మెడకు చుట్టుకొని రెండేళ్ల నిషేధంతో పాటు ఆసీస్‌కు కెప్టెన్‌ కాకుండా లైఫ్‌టైమ్ బ్యాన్‌ విధించింది. అయితే తనపై కెప్టెన్సీ లైఫ్‌టైమ్‌ బ్యాన్‌ ఎత్తివేయాలంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియాకు అప్పీల్‌ చేసుకుంటే కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు.

సొంత బోర్డు నుంచే కనీస మద్దతు కరువవడంతో తెగ బాధపడిపోయిన వార్నర్‌..'' మీ కెప్టెన్సీకో దండం.. నా అప్పీల్‌ను వెనక్కి తీసుకుంటున్నాని.. ఇకపై ఆ విషయం కూడా ఎత్తను'' అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వార్నర్‌ తీరుపై స్పందించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. ''కెప్టెన్సీ కాదు ముందు మీ ఆటతీరులో దమ్ము చూపించండి.. అప్పుడు కెప్టెన్సీపై చర్చకు రండి'' అంటూ పరోక్షంగా వార్నర్‌కు సవాల్‌ విసిరింది.

నిజానికి వార్నర్‌ కూడా అంత గొప్ప ఫామ్‌లో అయితే లేడనే చెప్పాలి. ఇటీవలే ముగిసిన టి20 వరల్డ్‌కప్‌లోనూ వార్నర్‌ పెద్దగా ప్రభావం చూపించింది లేదు. అందునా టెస్టుల్లో వార్నర్‌ మెరిసి చాలా కాలమైపోయింది. వార్నర్‌ బ్యాట్‌ నుంచి శతకం జాలువారి మూడేళ్లు కావొస్తుంది. దీనికి తోడు ఆటను పక్కనబెట్టి కెప్టెన్సీ అంశంపై క్రికెట్‌ ఆస్ట్రేలియాతో సున్నం పెట్టుకోవడం సొంత అభిమానులకు కూడా నచ్చలేదు. అన్ని వైపుల నుంచి వార్నర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

క్రికెట్‌ ఆస్ట్రేలియా చేసిన కామెంట్స్‌ను వార్నర్‌ సీరియస్‌గా తీసుకున్నాడనిపించింది. ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో తనపై వస్తున్న విమర్శలన్నింటికి చెక్‌ పెట్టాడు. మెల్‌బోర్న్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన రెండో టెస్టు వార్నర్‌ కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం. తన వందో టెస్టులో సెంచరీతో మెరిసి అన్నింటికి సమాధానం చెప్పాలనుకున్నాడు. అనుకున్నట్లుగానే తన పంతం నెరవేర్చుకున్నాడు డేవిడ్‌ వార్నర్‌.

శతకంతో మెరవడమే సూపర్‌ అనుకుంటే.. ఏకంగా డబుల్‌ సెంచరీతో కథం తొక్కి సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. దాదాపు 1089 రోజులు శతకం లేకుండా కొనసాగిన వార్నర్‌ ఇన్నింగ్స్‌లకు ఇది మరో టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. ఏ బోర్డు అయితే తనకు సవాల్‌ విసిరిందో అదే బోర్డుతో చప్పట్లు కొట్టించుకున్నాడు వార్నర్‌. ఇది అందరికి సాధ్యం కాదు. కచ్చితంగా వార్నర్‌ కెరీర్‌లో ఈ ఇన్నింగ్స్‌ ఎప్పటికి మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

చదవండి: వారీ ఎంత పని జరిగే.. గట్టిగా తాకుంటే ప్రాణం పోయేదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top