ఐపీఎల్-2026 సీజన్‌లో ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకొన్నాడు. కుడి తొడ గాయంతో బాధపడుతున్న ఓవర్టన్.. తదుపరి చికిత్స కోసం యూకేకు తిరుగు ప్రయాణమయ్యాడు.
ఈ విషయాన్ని సీఎస్‌కే మేనెజ్‌మెంట్ అధికారికంగా ధ్రువీకరించింది. అతడి స్ధానంలో దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ డియన్ ఫారెస్టర్‌ను సీఎస్‌కే తమ జట్టులోకి తీసుకుంది. రూ.75 లక్షల కనీస ధరకు అతడితో చెన్నై సూపర్ కింగ్స్ ఒప్పందం కుదుర్చుకుంది.
"జేమీ ఓవర్టన్‌కు కుడి తొడకు గాయమైంది. అతడు తదుపరి చికిత్స కోసం యూకేకు తిరిగి వెళ్లిపోయాడు. ఓవర్టన్ లేకపోవడం జట్టు సమతుల్యతను దెబ్బతీస్తుంది. కానీ కొత్త ఆటగాళ్లు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నాం" సీఎస్‌కే యాజమాన్యం ఓ ప్రకటనలో పేర్కొంది.
కాగా ఓవర్టన్ దూరం కావడం సీఎస్‌కే నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఓవర్టన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 14 వికెట్లు తీసి జట్టులో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచారు.
అటు బ్యాట్‌తోనూ లోయర్ ఆర్డర్‌లో కీలక పరుగులు చేస్తూ జట్టుకు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇక ఓవర్టన్ స్ధానంలో జట్టులోకి వచ్చిన ఫారెస్టర్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఇటీవల ముగిసిన పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఫారెస్టర్ అదరగొట్టాడు.
సీఎస్‌కే తమ తదుపరి మ్యాచ్‌లో మే 15న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్ధానంలో ఉన్న సీఎస్‌కేకు ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌లు అత్యంత కీలకం.
చదవండి: IND vs SL: భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్


