అపూర్వ సహోదరులు

Bryan Brothers Not On US Open Entry List - Sakshi

 ఆట ముగించిన బ్రియాన్‌ బ్రదర్స్‌! 

యూఎస్‌ ఓపెన్‌కు దూరం

టెన్నిస్‌ డబుల్స్‌లో అద్భుతాలు చేసిన ద్వయం 

నువ్వు ఆ వైపునుంచి చూసుకో...నేను ఈ వైపునుంచి చూసుకుంటా... సరిగ్గా ఇదే కాకపోయినా ఇలాంటి భావం, భాషతోనే వారిద్దరు ప్రత్యర్థుల పని పట్టారు. ఆటలో అన్నదమ్ములు ఎలా ఉండాలంటే అచ్చం ‘బ్రియాన్‌ బ్రదర్స్‌’లా ఉండాలి. అద్దంలో ప్రతిబింబాల్లాంటి వీరిద్దరు కలిసి టెన్నిస్‌లో అద్భుతాలు చేశారు. విడిగా ఒక్కొక్కరి పేరుతో వీరాభిమానులు కూడా వారిని గుర్తు పెట్టుకోలేరు. ‘బ్రదర్స్‌’ అనే సర్వనామంతోనే వీరికి గుర్తింపు వచ్చింది. ఇందులో ఒకరు లేకుండా మరొకరి అస్తిత్వం లేదంటే అతిశయోక్తి కాదు. ఎడమ చేతి, కుడి చేతి వాటం కలయిక, అత్యద్భుత సమన్వయంతో టెన్నిస్‌ కోర్టులో సంచలనాలు సృష్టించిన బ్రియాన్‌ జోడి ఇకపై ఆట ముగించనుంది. సొంతగడ్డపై జరిగే యూఎస్‌ ఓపెన్‌నుంచి వీరు తప్పుకోవడంతో ఈ ‘హలో బ్రదర్‌’  శకం ముగిసినట్లయింది.    
–సాక్షి క్రీడా విభాగం

ఒకటి కాదు, రెండు కాదు పురుషుల డబుల్స్‌లో ఏకంగా 16 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను జోడిగా ‘బ్రియాన్‌ బ్రదర్స్‌’ గెలుచుకున్నారు. గ్రాస్, హార్డ్, క్లే... కోర్టు ఏదైనా వారికి లెక్క లేదు. అన్ని సర్ఫేస్‌లపై వారిద్దరి హవా సుదీర్ఘ కాలం కొనసాగింది. అంకెలపరంగా చూస్తే రెండు నిమిషాలు పెద్దవాడైన మైకేల్‌ కార్ల్‌ బ్రియాన్‌ (మైక్‌)... తమ్ముడు రాబర్ట్‌ చార్లెస్‌ బ్రియాన్‌ (బాబ్‌) కంటే మరో రెండు పురుషులు గ్రాండ్‌స్లామ్‌లు ఎక్కువగా గెలిచాడు. అయితే మిక్స్‌డ్‌ విభాగంలో అన్న (4)తో పోలిస్తే ఎక్కువ టైటిల్స్‌ సాదించిన బాబ్‌ (7) ఓవరాల్‌గా ఒక మెట్టు పైన ఉండటం విశేషం.

1995లో తొలి సారి యూఎస్‌ ఓపెన్‌తో జంటగా బరిలోకి దిగిన ఈ సోదరుల విజయ ప్రస్థానం 2003లో ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిల్‌ విజయంతో కీలక మలుపు తీసుకొని జంటగా 16 గ్రాండ్‌స్లామ్‌ సాధించే వరకు సాగింది. గాయం కారణంగా బాబ్‌ కొంత కాలం ఆటకు దూరం కావడంతో జాక్‌ సాక్‌తో కలిసి బరిలోకి దిగిన మైక్‌ మరో రెండు గ్రాండ్‌స్లామ్‌లను గెలుచుకున్నాడు. 2020 సీజన్‌ తమకు చివరిది కానుందని 42 ఏళ్ల బ్రియాన్‌ బ్రదర్స్‌ గత ఏడాది చివర్లోనే ప్రకటించారు. యూఎస్‌ ఓపెన్‌ చివరి సారిగా ఆడతామని వారు గత నెలలోనే చెప్పారు. అయితే ఈ టోర్నీలో బరిలోకి దిగుతున్నవారి జాబితాను గురువారం నిర్వాహకులు ప్రకటించగా...అందులో అనూహ్యంగా వీరిద్దరు పేరు లేదు. దాంతో రిటైర్‌ కావాలని నిర్ణయించుకున్నట్లు అర్థమైంది. చరిత్రలో పలు ఘనతలు లిఖించుకున్న ఈ సోదరుల రికార్డులు, విశేషాలు కొన్ని చూస్తే... 

 ‘బ్రియాన్‌ బ్రదర్స్‌’ సాధించిన విజయాలు  
గ్రాండ్‌స్లామ్‌ డబుల్స్‌ టైటిల్స్‌: 18 (6 ఆస్ట్రేలియన్‌ ఓపెన్, 2 ఫ్రెంచ్‌ ఓపెన్, 3 వింబుల్డన్, 5 యూఎస్‌ ఓపెన్‌)  
ఏటీపీ మాస్టర్స్‌ టైటిల్స్‌: 39  
వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టైటిల్స్‌: 4 
ఒలింపిక్‌ విజయాలు: 1 స్వర్ణం (2012), 1 కాంస్యం (2008) 
డేవిస్‌ కప్‌ టైటిల్‌: 1 (2007)  
వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచిన సమయం: 438 వారాలు (ఇందులో వరుసగా 139 వారాలు) 
మొత్తం డబుల్స్‌ టైటిల్స్‌: 119  
ప్రతీ గ్రాండ్‌స్లామ్‌ను కనీసం 2 సార్లు గెలిచి ‘డబుల్‌ కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌’ సాధించిన ఏౖకైక జంట

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top