Commonwealth Fencing: భవాని దేవీకి స్వర్ణం

Bhavani Devi Wins Gold, Defends Commonwealth Fencing Championship Title - Sakshi

లండన్‌: ఇటీవల ముగిసిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత అథ్లెట్లు అదరగొట్టారు. ఇప్పుడు అక్కడే కామన్వెల్త్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ జరుగుతుండగా ఇందులోనూ భారత ఫెన్సర్‌ సత్తా చాటింది. చెన్నైకి చెందిన భవానీ దేవి అద్భుత ప్రదర్శనతో స్వర్ణం నిలబెట్టుకుంది. టైటిల్‌ నిలబెట్టుకునే క్రమంలో 42వ ర్యాంకర్‌ భవాని 15–10తో రెండో సీడ్‌ వెరొనికా వాసిలెవా (ఆస్ట్రేలియా)ను కంగుతినిపించింది. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్‌గా ఘనత వహించిన ఆమె పసిడి పోరులో చక్కని ప్రతిభ కనబరిచింది.

ఈ ఏడాది ఆరంభంలో తడబాటుకు గురైన ఆమె ఈ చాంపియన్‌షిప్‌లో మాత్రం నిలకడైన ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. తొలుత ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ కప్‌లో 23వ స్థానంలో నిలిచి నిరాశ పడింది. అనంతరం జూలైలో కైరోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. ఈ ఏడాది భవానీ దేవి పాల్గొన్న పదో అంతర్జాతీయ ఈవెంట్‌ ఈ కామన్వెల్త్‌ చాంపియన్‌షిప్‌ కాగా ఇందులో విజేతగా నిలవడం సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొంది. ‘ఫైనల్‌ పోటాపోటీగా సాగింది. హోరాహోరీ పోరులో స్వర్ణం గెలుపొందడం ఆనందంగా ఉంది. ఇదే జోరును ఇకపై కొనసాగిస్తాను’ అని భవాని తెలిపింది.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top