
అన్నవరం పంచాయతీ సర్వే నంబర్ 101/1లో రెవెన్యూ అధికారుల ఆదేశాలతో కంచె వేస్తున్న కూలీలు
70 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న రైతుల్ని భూముల్లోకి రానీయని వైనం
మే ఫెయిర్ హోటల్‌కు భూములు ఇవ్వబోమన్న అన్నదాతలు
తగరపువలస: ఓ హోటల్ కోసం హైకోర్టు స్టేటస్‌కో ఆదేశాలున్న భూముల్లో రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో బుధవారం జంగిల్ క్లియరెన్స్ చేయడంతోపాటు ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టడంపై విశాఖ, విజయనగరం జిల్లాల రైతులు ఆందోళన చెందుతున్నారు. మే ఫెయిర్ హోటల్‌కు కూటమి సర్కారు కేటాయించిన భూముల్ని ఇచ్చేందుకు తిరస్కరించిన రైతులు గతంలోనే హైకోర్టును ఆశ్రయించి స్టేటస్‌కో ఉత్తర్వులు తీసుకున్నారు. విశాఖ జిల్లా భీమిలి మండలం అన్నవరం పంచాయతీ సర్వే నెం.101/1లో బుధవారం భీమిలి రెవెన్యూ అధికారులు 200 మంది కూలీలతో జంగిల్ క్లియరెన్స్‌తో పాటు ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు.
70 ఏళ్లకు పైగా ఈ భూములలో సరుగుడు, కొబ్బరి, నీలగిరి, జీడి తదితర తోటలు సాగు చేసుకుంటూ డీఆర్ నంబరు కలిగిన రైతులను అక్కడకు అనుమతించలేదు. విలేకరులను కూడా దూరం నుంచే పోలీసులు పంపించేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇదే సర్వే నంబరులో స్టార్ ఒబెరాయ్ గ్రూప్‌నకు స్థలాలు కేటాయించినప్పుడు రైతులకు ప్రతిఫలంగా ఎకరాకు 20 సెంట్లు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం ఇదే సర్వే నంబరులో మే ఫెయిర్ హోటల్‌కు 40 ఎకరాలు కేటాయించింది. అందుకుగాను రైతులకు ఎకరాకు 5 సెంట్లు మాత్రమే ఇస్తామనడంతో వారు అంగీకరించలేదు.
జూన్‌లో ఈ భూములను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన మే ఫెయర్ సిబ్బందిని రైతులు అడ్డుకున్నారు. అప్పట్లో భీమిలి తహసీల్దారు రామారావు ఫిర్యాదు మేరకు భీమిలి మండలం అన్నవరం పంచాయతీ, విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం పంచాయతీలకు చెందిన రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ 40 ఎకరాల రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో వారికి స్టేటస్‌కో ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఈ పిటిషన్‌ను గురువారానికి వాయిదా వేసింది.
పేదల కడుపుకొట్టి హోటల్‌కు భూములా?
ఇందులో మా కుటుంబానికి ఎ.8.50 సెంట్లు ఉంది. ల్యాండ్ పూలింగ్‌కు అడిగినా ఇవ్వలేదు. హైకోర్టును ఆశ్రయించి జిల్లా అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. పేదల కడుపు కొట్టి ప్రభుత్వం హోటల్‌కు భూములు ఇస్తుంది. – దువ్వి అప్పన్న, తూడెం