BGT 2023: బిగ్‌ న్యూస్‌.. భారత్‌-ఆస్ట్రేలియా టెస్ట్‌ మ్యాచ్‌ వేదిక మార్పు

BGT 2023 IND VS AUS: 3rd Test Venue Shifted From Dharamshala - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీకి సంబంధించి బిగ్‌ న్యూస్‌ లీకైంది. సిరీస్‌లో భాగంగా భారత్‌-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 1 నుంచి ధర్మశాల వేదికగా మూడో టెస్ట్‌ మ్యాచ్‌ జరగాల్సి ఉంది. అయితే ఈ మ్యాచ్‌ వేదిక మారే అవకాశాలున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. బీసీసీఐలోని ఓ కీలక వ్యక్తి అందించిన సమాచారం మేరకు.. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన మూడో టెస్ట్‌ మ్యాచ్‌ ధర్మశాలలో జరిగేది అనుమానమని తెలుస్తోంది.

ధర్మశాల స్టేడియంలో రెనొవేషన్ (పునరుద్ధరణ) పనులు  జరుగుతున్నాయని, మార్చి 1 నాటికి అవి పూర్తవుతాయా.. లేదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారిందని సదరు అధికారి తెలిపాడు. ఈనెల (ఫిబ్రవరి) 3న బీసీసీఐ బృందం నిర్వహించిన తనిఖీల్లో ఔట్ ఫీల్డ్‌తో పాటు పిచ్‌ సైడ్‌ ఏరియా పూర్తిగా సిద్ధంగా లేదని తేలిందని వివరించాడు.

అయితే టెస్ట్‌ ప్రారంభానికి మరో మూడు వారాల సమయం ఉందని, ఆలోపు పెండింగ్ పనులను పూర్తి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పీసీఏ) హామీ ఇచ్చినట్లు పేర్కొన్నాడు. మూడో టెస్ట్‌కు బ్యాకప్‌గా మరో ఐదు స్టేడియాలు ఎంపిక చేసినట్లు వివరించాడు. మూడో టెస్ట్‌ మొహాలీలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నట్లు సదరు అధికారి తెలిపాడు. 

కాగా, స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కొద్దిరోజుల క్రితమే ధర్మశాలలో పాత పిచ్‌ను తొలగించి కొత్తది తయారు చేశారు. వర్షం కురిస్తే మ్యాచ్‌కు అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను కొత్త డ్రైనేజీ వ్యవస్థను అమర్చారు. దీంతో పాటు గ్రౌండ్‌లో స్ప్రింక్లర్లను కూడా ఫిట్‌ చేశారు. ఈ పనులు చివరి దశలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ధర్మశాలలో మూడో టెస్ట్‌ జరిగేది అనుమానంగా మారింది. 

ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఇటీవల ముగిసిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top