IND VS AUS 1st Test: టీమిండియా ఘనమైన రికార్డు.. 43 టెస్ట్‌ల్లో రెండింటిలో మాత్రమే..!

BGT 2023 1st Test: Australia Lowest Total Vs India In India - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి ఆసీస్‌ను మట్టికరిపించారు. ఫలితంగా 4 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. 

ఈ మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (5/47, 70, 2/34) ఇరగదీయగా, రోహిత్‌ శర్మ (120) సెంచరీతో, అశ్విన్‌ (3/42, 5/37) 8 వికెట్లతో, అక్షర్‌ పటేల్‌ (84) బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో, ఆఖర్లో షమీ మెరుపు ఇన్నింగ్స్‌ (47 బంతుల్లో 37; 2 ఫోర్లు, 3 సిక్సర్లు)తో విజృంభించారు. టీమిండియా స్పిన్‌ ద్వయం అశ్విన్‌-జడేజా ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైన ఆసీస్‌.. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే టపా కట్టేసింది. తద్వారా ఆసీస్‌ ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. 

కమిన్స్‌ సేన భారత్‌పై భారత్‌లో అత్యల్ప స్కోర్‌ను నమోదు చేసిన జట్టుగా రికార్డుల్లోకెక్కింది. 2003లో వాంఖడేలో 93 పరుగులకే ఆలౌటైన ఆసీస్‌.. ఈ మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే చాపచుట్టేసి 20 ఏళ్ల కిందటి చెత్త రికార్డును తిరగరాసింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్‌పై స్వదేశంలో కాని భారత్‌తో కాని ఇది రెండో అత్యల్ప స్కోర్‌గా రికార్డైంది. 1981లో మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్ట్‌లో ఆసీస్‌ 83 పరుగులకే ఆలౌటై భారత్‌పై అత్యల్ప స్కోర్‌ను రికార్డు చేసింది. 

ఈ మ్యాచ్‌లో 91 పరుగులకే ఆలౌట్‌ కావడం ద్వారా ఆసీస్‌ చెత్త రికార్డును మూటగట్టుకుంటే.. రోహిత్‌ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. తొలి టెస్ట్‌లో ఆసీస్‌పై విజయంతో.. స్వదేశంలో టీమిండియా విజయాల సంఖ్య 35కు చేరుకుంది. సొంతగడ్డపై తిరుగులేని జట్టుగా పేరొందిన భారత్‌.. చివరిగా ఆడిన 43 మ్యాచ్‌ల్లో 35 విజయాలు సాధించి, కేవలం రెండింటిలో మాత్రమే ఓడింది. మిగిలిన 6 మ్యాచ్‌లు డ్రాగా ముగిసాయి.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top