IND VS AUS 1st Test: పిచ్‌పై నిందలేల.. అశ్విన్‌ డూప్‌ను ప్రత్యేకంగా పిలిపించుకున్నారు కదా..?

IND VS AUS 1st Test: Indian Fans Slams Aussie Formers For Blaming Pitch - Sakshi

బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా ఇన్నింగ్స్‌ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కేవలం 3 రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు అన్ని విభాగాల్లో అద్భుతంగా రాణించి, 4 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. ముఖ్యంగా ఈ మ్యాచ్‌ గెలుపులో భారత స్పిన్నర్లు ప్రధాన పాత్ర పోషించారు. రవీంద్ర జడేజా (5/47, 2/34), రవిచంద్రన్‌ అశ్విన్‌ (3/42, 5/37) పోటీపడి మరీ సత్తా చాటారు. జడేజా అయితే బ్యాట్‌తోనూ (70) రాణించి శభాష్‌ అనిపించుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో భారత్‌ స్పిన్నర్లు మొత్తంగా 16 వికెట్లు (జడేజా 7, అశ్విన్‌ 8, అక్షర్‌ 1) పడగొట్టి ఆసీస్‌ పతనాన్ని శాశించారు. టీమిండియా కోల్పోయిన 10 వికెట్లలో సైతం ప్రత్యర్ధి స్పిన్నర్లే ప్రధానంగా దక్కించుకున్నారు. అరంగేట్రం స్పిన్నర్‌ టాడ్‌ మర్ఫీ 7 వికెట్లతో చెలరేగగా, వెటరన్‌ స్పిన్నర్‌ నాథన్‌ లయోన్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. మొత్తంగా చూస్తే నాగ్‌పూర్‌ టెస్ట్‌లో స్పిన్నర్ల హవా నడిచిందన్న విషయం స్పష్టమవుతుంది. ఆ జట్టు, ఈ జట్టు అన్న తేడా లేకుండా ఇరు జట్లకు చెందిన స్పిన్నర్లు సింహభాగం వికెట్లు దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో నేలకూలిన 30 వికెట్లలో 24 వికెట్లు స్పిన్నర్ల ఖాతాలోకి వెళ్లగా.. పేసర్లు షమీ 3, కమిన్స్‌ 2, సిరాజ్‌ ఓ వికెట్‌ దక్కించుకున్నారు. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టీమిండియా సాధించిన ఘన విజయాన్ని ఓర్వలేకపోతున్న ఆసీస్‌ మీడియా, అభిమానులు, ఆ దేశ మాజీలు విషప్రచారం​ మొదలుపెట్టారు. భారత జట్టు తమ స్పిన్నర్లకు అనుకూలించే పిచ్‌ను ప్రత్యేకంగా తయారు చేయించుకుందని బురదజల్లుతున్నారు. దీనికి కౌంటర్‌గా భారత అభిమానులు, మాజీలు కూడా స్పందిస్తున్నారు. ఆసీస్‌ చేసే విషప్రచారాన్ని టీమిండియా ఫ్యాన్స్‌ తిప్పికొడుతున్నారు. ఒక్క జట్టుకు మాత్రమే సహకరించే పిచ్‌లను తయారు చేసుకోవడం ఎలా సాధ్యపడుతుంది, ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు ఫ్యాన్స్‌కు కూడా చిప్‌ దొబ్బినట్లుందని మండిపడుతున్నారు.

ఇదే జరిగి ఉంటే ఆసీస్‌ స్పిన్నర్లు 8 వికెట్లు ఎలా తీస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఆసీస్‌ అభిమానులు ఓటమిని ఒప్పుకుంటే హుందాగా ఉంటుందని, ఇలాంటి చౌకబారు ప్రచారం మానుకోకపోతే టీమిండియా సిరీస్‌ను క్లీన్‌ స్వీప్‌ చేసి బుద్ధి చెబుతుందని చురకలంటిస్తున్నారు. కొందరు హార్డ్‌కోర్‌ ఇండియన్‌ ఫ్యాన్స్‌ అయితే.. ఈ మ్యాచ్‌కు ముందు ఆసీస్‌ ఆటగాళ్లు చేసిన హడావుడిని ప్రస్తావిస్తూ సెటైర్లు వేస్తున్నారు. అచ్చం అశ్విన్‌లా బౌలింగ్‌ చేసే డూప్‌ను ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ నెట్స్‌లో ప్రాక్టీస్‌ చేశారు కదా అని పంచ్‌లు వేస్తున్నారు. నెట్స్‌లో అతని బౌలింగ్‌లో ఇరగదీసిన వారికి మ్యాచ్‌లో ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

కాగా, తొలి టెస్ట్‌కు ముందు ఆసీస్‌ క్రికెటర్లు బరోడా స్పిన్నర్‌, అచ్చం అశ్విన్‌లా బౌలింగ్‌ చేసే మహేశ్‌ పితియాను నెట్స్‌లోకి ప్రత్యేకంగా ఆహ్వానించి మరీ ప్రాక్టీస్‌ వెలగబెట్టారు. నెట్స్‌లో మహేశ్‌ ఆసీస్‌ బ్యాటర్లకు బాగానే ఉపయోగపడ్డాడు. దీని వల్లే ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో కనీసం ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో లోపాలను ప్రాక్టీస్‌ సెషన్స్‌ సందర్భంగా మహేశ్‌ స్వయంగా ప్రస్తావించాడు.

స్టీవ్‌ స్మిత్‌ను నెట్స్‌లో ఐదారు సార్లు ఔట్‌ చేసినట్లు మహేశ్‌ చెప్పాడు. ఇక్కడ మరో ఆసక్తికర అంశమేమింటంటే.. తన ఆరాధ్య ఆటగాడు అశ్విన్‌ ఎదురుపడిన సందర్భంగా మహేశ్‌ అతని పాదాలకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్నాడు. ఆ సందర్భంలో కోహ్లి సైతం మహేశ్‌ను పలకరించాడు. ఇప్పుడిప్పుడే కెరీర్‌ను ప్రారంభిస్తున్న 21 ఏళ్ల మహేశ్‌.. అశ్విన్‌ను ఆరాధ్య దైవంగా కొలుస్తూ.. అతన్నే ఆదర్శంగా తీసుకున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top