టి20లకు కొత్త ‘మెరుపు’

BCCI set to introduce Impact Player rule in domestic T20 - Sakshi

బరిలోకి ఇంపాక్ట్‌ ప్లేయర్‌

ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అమలు చేయాలని బీసీసీఐ నిర్ణయం  

ముంబై: టి20లు ఎక్కడ జరిగినా దానికున్న క్రేజే వేరు. భారత్‌లో అయితే మరీనూ! అందుకే పొట్టి ఆటకు మరో ‘మెరుపు’ జత చేయాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి ప్రయత్నమే చేస్తోంది. విశేష ఆదరణ చూరగొన్న టి20  క్రికెట్‌ ప్రాచుర్యాన్ని మరింత పెంచాలని సరికొత్త ప్రయోగానికి బీసీసీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా ‘టాక్టికల్‌ సబ్‌స్టిట్యూట్‌’ను ప్రవేశ పెట్టనుంది.

ముందుగా దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నీ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో అమలు చేసి... అందులో విజయవంతమైతే వెంటనే వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్‌లోనూ కొత్త సొబగుతో సరికొత్త ‘షో’కు శ్రీకారం చుట్టాలని బీసీసీఐ భావిస్తోంది. అక్టోబర్‌ 11 నుంచి జరిగే ముస్తాక్‌ అలీ టోర్నీలో ‘టాక్టికల్‌ సబ్‌స్టిట్యూట్‌’ నిబంధన తీసుకొస్తున్నట్లు బోర్డు ఇది వరకే అనుబంధ రాష్ట్ర సంఘాలకు సమాచారం ఇచ్చింది.  

ఏంటీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌ కథ
సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ కొత్తేం కాదు. ఆటగాడు గాయపడితే సబ్‌స్టిట్యూట్‌ను ఎప్పటి నుంచో ఆడిస్తున్నారు. కానీ బ్యాటింగ్, బౌలింగ్‌ చేసేందుకు వీల్లేదు. ఫీల్డింగ్‌కే పరిమితం! తలకు గాయమైన సందర్భంలో కన్‌కషన్‌ అయితే మాత్రం బ్యాటింగ్, లేదా బౌలింగ్‌ చేసే వెసులుబాటు సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌కు ఉంది. అయితే ఇప్పుడు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ భిన్నమైంది. టాస్‌కు ముందు తుది జట్టుకు అదనంగా నలుగురు ఆటగాళ్ల జాబితా ఇస్తారు. ఇందులో ఒకరు సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌గా పూర్తిస్థాయి ఆటగాడి హక్కులతో ఆడతాడు. 14వ ఓవర్‌ పూర్తయ్యేలోపు తుది 11 మందిలో ఒకరిస్థానంలో ‘ఇంపాక్ట్‌ ప్లేయర్‌’ను బరిలోకి దింపొచ్చు. ఇది గేమ్‌ చేంజర్‌ కాగలదని బీసీసీఐ భావిస్తోంది. ఈ తరహా నిబంధన బిగ్‌బాష్‌ లీగ్‌లో కొన్ని షరతులతో ఉంది.

అప్పట్లో... వన్డేల్లో!
క్రికెట్‌లో సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ ప్రయోగం కొత్తేం కాదు. 17 ఏళ్ల క్రితం వన్డేల్లో సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడిని ఆడించారు. ఐసీసీ 2005లో ప్రవేశపెట్టిన నిబంధన ప్రకారం టాస్‌కు ముందు 12వ ఆటగాడిగా ఆ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్‌ను జట్లు ప్రకటించేవి. తుది జట్లకు ఆడించేవి. కారణాలేవైనా 2006 ఏడాది తర్వాత ఈ నిబంధనను ఎత్తేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top