అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ | BCCI Responds To Reports Of Agarkar Seeking Extension As Chief Selector | Sakshi
Sakshi News home page

అతడికి ఆ అవసరం లేదు: బీసీసీఐ

Mar 20 2026 3:48 PM | Updated on Mar 20 2026 4:08 PM

BCCI Responds To Reports Of Agarkar Seeking Extension As Chief Selector

టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరికొంత కాలం తనను కొనసాగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI)కి అతడు విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి. వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు తానే చీఫ్‌ సెలక్టర్‌గా ఉంటానని అగార్కర్‌ కోరినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.

అతడికి ఆ అవసరం లేదు
ఈ అంశంపై బీసీసీఐ అధికారి ఒకరు తాజాగా స్పందించారు. అగార్కర్‌ తమ వద్ద ఇలాంటి ప్రతిపాదన తేలేదని కొట్టిపారేశారు. PTIతో మాట్లాడుతూ.. ‘‘సెలక్షన్‌ ప్యానెల్‌లోని సబ్‌ కమిటీతో సహా సెలక్టర్లందరి కాంట్రాక్టు ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉంది.

అజిత్‌ కాంట్రాక్టు కూడా సెప్టెంబరులోనే ముగుస్తుంది. బీసీసీఐ కార్యదర్శి, అజిత్‌ కలిసి చర్చించిన తర్వాతే.. అజిత్‌ వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు కొనసాగుతాడా? లేదా? అన్న విషయంపై స్పష్టత వస్తుంది.

బీసీసీఐ నిబంధనల ప్రకారం సీనియర్‌ సెలక్టర్‌ నాలుగు ఏళ్ల వరకు కొనసాగే అవకాశం ఉంటుంది. కాబట్టి అతడు తన పదవీకాలాన్ని పొడిగించాలని అభ్యర్థించాల్సిన అవసరం పెద్దగా ఉండదు’’ అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా 2023, జూన్‌లో మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌ టీమిండియా చీఫ్‌ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టాడు.

సాహసోపేత నిర్ణయాలు 
సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌గా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ అజిత్‌ అగార్కర్‌ తనదైన ముద్ర వేయగలుగుతున్నాడు. అతడి హయాంలో టీమిండియా 2023 వన్డే వరల్డ్‌కప్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2024లో టీ20 ప్రపంచకప్‌, 2025లో ఆసియా టీ20 కప్‌, 2025 చాంపియన్స్‌ ట్రోఫీ.. తాజాగా టీ20 ప్రపంచకప్‌-2026 టైటిళ్లను భారత్‌ గెలుచుకుంది.

ఇక అజిత్‌ అగార్కర్‌కు తోడుగా హెడ్‌కోచ్‌గా మరో మాజీ క్రికెటర్‌ గౌతం గంభీర్‌ వచ్చాక.. నాయకత్వ బృందంలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను కాదని.. సూర్యకుమార్‌ యాదవ్‌ను నియమించగా.. అతడు 2026లో వరల్డ్‌కప్‌ గెలిచాడు. 

సీనియర్ల రిటైర్మెంట్‌
ఇక వన్డే కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించగా ఇంత వరకు మూడింట ఒక్క సిరీస్‌ కూడా అతడు గెలవలేకపోయాడు. మరోవైపు.. ఈ జోడీ హయాంలోనే దిగ్గజ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ క్రికెట్‌కు వీడ్కోలు పలకగా.. బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించారు. 

ఇక 2024లో వరల్డ్‌కప్‌ గెలిచిన తర్వాత అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పిన రో-కో.. ప్రస్తుతం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నారు. వీరిద్దరు వన్డే వరల్డ్‌కప్‌-2027 వరకు ఆడతామని సంకేతాలు ఇవ్వగా.. అగార్కర్‌ మాత్రం ఈ విషయంలో తమకు స్పష్టత లేదని చెప్పడం గమనార్హం.

చదవండి: ODI WC: ఇప్పటికే ఇరవై మందిని షార్ట్‌లిస్ట్‌ చేసిన బీసీసీఐ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement