బంగ్లాదేశ్ పంతం వీడలేదు. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 ఆడే విషయమై తమ వైఖరిలో ఎలాంటి మార్పూ లేదని మరోసారి పునరుద్ఘాటించింది. అయితే, అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తమ విషయంలో న్యాయంగా వ్యవహరిస్తుందనే నమ్మకం ఉందని తెలిపింది.
శ్రీలంకకు మార్చాలని
కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో భద్రతా కారణాలు సాకుగా చూపుతూ.. బంగ్లాదేశ్ తమ ప్లేయర్లను భారత్‌కు పంపడానికి నిరాకరిస్తోంది. భారత్‌కు బదులు తమ మ్యాచ్‌ల వేదికలను శ్రీలంకకు మార్చాలని ఐసీసీకి విజ్ఞప్తి చేసింది. అయితే, బంగ్లాదేశ్ చెప్పినట్లు భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, ఇతర సిబ్బందికి వచ్చిన ముప్పేమీ లేదని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది.
కుండబద్దలు బద్దలు కొట్టిన ఐసీసీ
మరో 24 గంటల సమయం ఇస్తున్నామని.. ఒకవేళ వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగానుకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ను ఆడిస్తామని ఐసీసీ కుండబద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో గురువారం బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. తమ ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే తుది నిర్ణయం వెలువడుతుందని పేర్కొన్నాడు.
తాజా సమాచారం ప్రకారం.. భారత్‌లో టీ20 ప్రపంచకప్-2026 మ్యాచ్‌లు ఆడవద్దని బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లా జాతీయ జట్టు ఆటగాళ్లు, దేశ క్రీడా, యువజన శాఖ మంత్రి ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం బోర్డు తమ వైఖరిని వెల్లడించింది.
నమ్మకాన్ని కోల్పోవడం లేదు
ఈ మేరకు మీడియా సమావేశంలో నజ్రుల్ మాట్లాడుతూ.. ‘‘ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించేందుకు మా క్రికెటర్లు ఎంతగానో కష్టపడ్డారు. అయితే, ఇండియాలో మా భద్రతపై అనుమానాలు అలాగే ఉన్నాయి. ఏవో కొన్ని పరిశీలన (ఐసీసీ)లు చేసి ముప్పు లేదనే నిర్ణయానికి రాకూడదు.
ఇప్పటికీ మేము నమ్మకాన్ని కోల్పోవడం లేదు. టోర్నీకి మా జట్టు సిద్ధంగా ఉంది. ఐసీసీ మా అభ్యర్థనను మన్నించి.. న్యాయమైన నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. మమ్మల్ని శ్రీలంకలో ఆడేందుకు అనుమతిస్తారని ఆశాభావంతో ఉన్నాము’’ అని పేర్కొన్నాడు.
కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే
ఇక బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘‘మేము ఐసీసీతో మరోసారి చర్చలు జరుపుతాము. వరల్డ్‌కప్‌లో ఆడాలని మాకు ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఆడబోము. ఈ విషయంపై పోరాటం చేస్తాం. ఐసీసీ బోర్డు మీటింగ్‌లో కొన్ని షాకింగ్ నిర్ణయాలు తీసుకున్నారు.
ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ తొలగింపు విషయం చిన్నదేమీ కాదు. మా మ్యాచ్‌ల విషయంలో బీసీసీఐదే తుది నిర్ణయం అన్నట్లుగా వ్యవహారం ఉంది. భారత్‌లో ఆడలేమని అంటే మా అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. క్రికెట్‌కు రోజురోజుకీ ఆదరణ పెరుగుతోంది. ఒలింపిక్స్ వరకు ఈ క్రీడ వెళ్లింది. కానీ మేము మాత్రం ఇక్కడే ఉండిపోయాము. ఇది కచ్చితంగా ఐసీసీ వైఫల్యమే’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!


