బ్యాటింగ్‌లో నజు్మల్‌... బౌలింగ్‌లో ముస్తఫిజుర్‌ | Bangladesh won on New Zealand in third ODI | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌లో నజు్మల్‌... బౌలింగ్‌లో ముస్తఫిజుర్‌

Apr 24 2026 2:38 AM | Updated on Apr 24 2026 2:38 AM

Bangladesh won on New Zealand in third ODI

మూడో వన్డేలో బంగ్లాదేశ్‌ ఘనవిజయం 

సిరీస్‌ కోల్పోయిన న్యూజిలాండ్‌  

చట్టోగ్రామ్‌: సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన బంగ్లాదేశ్‌ జట్టు... న్యూజిలాండ్‌పై 2–1తో వన్డే సిరీస్‌ చేజిక్కించుకుంది. గురువారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిథ్య బంగ్లాదేశ్‌ 55 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఇటీవల వెస్టిండీస్, పాకిస్తాన్‌పై వన్డే సిరీస్‌లు నెగ్గిన బంగ్లాకు ఇది వరుసగా మూడో సిరీస్‌ విజయం. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ నజు్మల్‌ హుసేన్‌ షాంటో (119 బంతుల్లో 105; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీతో విజృంభించగా... వికెట్‌ కీపర్‌ లిటన్‌ దాస్‌ (91 బంతుల్లో 76; 3 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఒకదశలో 32/3తో కష్టాల్లో పడ్డ జట్టును ఈ జోడీ ఆదుకుంది. షాంటో, లిటన్‌ నాలుగో వికెట్‌కు 160 పరుగులు చేయడంతో బంగ్లాదేశ్‌ కోలుకుంది. కివీస్‌ బౌలర్లలో విలియమ్‌ రూర్కె 3 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం లక్ష్యఛేదనలో న్యూజిలాండ్‌ 44.5 ఓవర్లలో 210 పరుగులకు ఆలౌటైంది. డీన్‌ ఫోక్స్‌క్రాఫ్ట్‌ (72 బంతుల్లో 75; 7 సిక్స్‌లు), నిక్‌ కెల్లీ (80 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధశతకాలతో పోరాడినా ఫలితం లేకపోయింది. ముస్తఫిజుర్‌ రహమాన్‌ 43 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. నహీద్‌ రాణాకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ ప్రారంభం కానుంది.  

Advertisement
 
Advertisement
Advertisement