బంగ్లాదేశ్ పర్యటనలో ఆదిలోనే పాకిస్తాన్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఆతిథ్య జట్టుతో తొలి టెస్టులో షాన్ మసూద్ బృందం ఏకంగా 104 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. మరోవైపు సొంతగడ్డపై బంగ్లాదేశ్ తొలిసారి పాక్‌పై టెస్టు గెలిచి చరిత్ర సృష్టించింది.
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య నిర్ణయాత్మక రెండో టెస్టు శనివారం మొదలైంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వైట్‌వాష్‌తో రికార్డు విజయం సాధించాలని బంగ్లాదేశ్ ఉవ్విళ్లూరుతుండగా.. పరువు కోసం పాక్ పాకులాడుతోంది.
అయితే, రెండో టెస్టు ఆరంభానికి ముందు పాక్ జట్టులో కలకలం రేగింది. కెప్టెన్ షాన్ మసూద్, ప్రధాన పేసర్ షాహిన్ ఆఫ్రిది మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. బంగ్లాతో తొలి టెస్టులో ఆఫ్రిది 3.5 ఎకానమీతో మొత్తంగా ఐదు వికెట్లు కూల్చాడు.
షాన్ మసూద్ అసంతృప్తి
అయితే, ఆఫ్రిది ప్రదర్శనపై షాన్ మసూద్ అసంతృప్తి వెళ్లగక్కినట్లు సమాచారం. ఇంకా మెరుగ్గా ఆడాలని డ్రెసింగ్‌రూమ్‌లోనే అతడికి క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఇందుకు షాహిన్ ఆఫ్రిది కూడా గట్టిగానే బదులిచినట్లు సమాచారం.
నీ సంగతి చూసుకో..
‘‘ముందు నీ సంగతి చూసుకో.. ముందుండి జట్టును నడిపించు.. బ్యాటింగ్‌పై శ్రద్ధ పెట్టు’ అని ఆఫ్రిది మసూద్‌కు కౌంటర్ ఇచ్చినట్లు టెలికామ్ ఆసియా స్పోర్ట్ కథనం పేర్కొంది. కాగా షాహిన్ ఆఫ్రిది ప్రవర్తనను తీవ్రంగా పరిగణించిన జట్టు యాజమాన్యం అతడిపై వేటు వేసింది.
మెరుగ్గా ఆడినప్పటికీ.. వేటు
బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు తుదిజట్టులో ఆఫ్రిదికి చోటే ఇవ్వలేదు. సెల్హైట్ వేదికగా శనివారం టాస్ గెలిచిన సందర్భంగా షాన్ మసూద్ మాట్లాడుతూ.. ‘‘మా తుదిజట్టులో మూడు మార్పులు చేశాము. ఇమామ్ స్థానంలో బాబర్, నొమన్‌కు బదులు సాజిద్ ఖాన్.. అదే విధంగా షాహిన్‌కు బదులు ఖుర్రం వచ్చారు’’ అని తెలిపాడు.
అయితే, గత మ్యాచ్‌లో మెరుగ్గా ఆడినప్పటికీ.. షాహిన్ ఆఫ్రిదిని తప్పించడంపై మాత్రం మసూద్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు. కాగా త్వరలోనే పాక్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టులు విడుదల చేయనుంది. ఇలాంటి తరుణంలో షాహిన్ ఆఫ్రిది కెప్టెన్‌తో గొడవపడి తుదిజట్టులో స్థానం కోల్పోయాడు. సెంట్రల్ కాంట్రాక్టు విషయంలోనూ అతడిపై వేటు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


