సునామీ శతకం.. చరిత్ర సృష్టించిన పాక్‌ | Ayesha Zafar's rapid ton crushes Zimbabwe | Sakshi
Sakshi News home page

సునామీ శతకం.. చరిత్ర సృష్టించిన పాక్‌

May 13 2026 12:19 PM | Updated on May 13 2026 1:29 PM

Ayesha Zafar's rapid ton crushes Zimbabwe

పాక్‌ మహిళల టీ20 జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. పరుగుల పరంగా తమ అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. నిన్న (మే 12) జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించింది. 153 పరుగుల భారీ తేడాతో జింబాబ్వేను మట్టికరిపించింది. 

తద్వారా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఘనంగా బోణీ కొట్టింది. దీనికి ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్‌ 3-0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. జింబాబ్వే మహిళల జట్టు తొలిసారి పాక్‌లో పర్యటిస్తూ ఆడుతున్న చారిత్రక సిరీస్‌ ఇది.

సునామీ శతకం
కరాచీ వేదికగా జరిగిన తొలి టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. అయేషా జాఫర్‌ (47 బంతుల్లో 102 నాటౌట్‌; 15 ఫోర్లు, 2 సిక్సర్లు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 237 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. పాక్‌ మహిళల జట్టు అంతర్జాతీయ స్థాయిలో 200 పరుగుల మార్కు తాకడం ఇదే తొలిసారి.

ఈ మ్యాచ్‌లో అయేషా జాఫర్‌ చేసిన సెంచరీ మహిళల అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో మూడో వేగవంతమైన సెంచరీగా రికార్డైంది. అలాగే మునీబా అలీ తర్వాత పాక్‌ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన రెండో ప్లేయర్‌గా అయేషా జాఫర్‌ నిలిచింది.

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో జింబాబ్వే జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. 18.2 ఓవర్లలో 84 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ ఫాతిమా సనా (3-0-7-3), సదియా ఇక్బాల్‌ (3.2-0-14-2), నతాలియా పర్వేజ్‌ (2-0-3-2), రమీన్‌ షమీమ్‌ (3-0-18-1) జింబాబ్వే ఇన్నింగ్స్‌ను నేలమట్టం చేశారు.  ఇరు జట్ల మధ్య రెండో టీ20 కరాచీ వేదికగా మే 14న జరుగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement