
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు నామమాత్రమైన పోరుకు సిద్ధమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా సోమవారం ఏక్నా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ఎస్ఆర్‌హెచ్ తలపడనుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నిష్క్రమించిన ఎస్ఆర్‌హెచ్.. కనీసం మిగిలిన మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావిస్తోంది.
ఈ క్రమంలో సన్‌రైజర్స్‌కు భారీ షాక్ తగిలింది. లక్నోతో మ్యాచ్‌కు ముందు ఆ జట్టు స్టార్ ఓపెనర్, ఆస్ట్రేలియా విధ్వంసకర వీరుడు ట్రావిస్ హెడ్ కరోనా బారిన పడ్డాడు. అతడు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు. దీంతో లక్నో మ్యాచ్‌కు హెడ్ దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఎస్ఆర్‌హెచ్ హెడ్ కోచ్ డేనియల్ వెట్టోరి ధ్రువీకరించాడు.
"ట్రావిస్ హెడ్‌కు దురదృష్టవశాత్తు కోవిడ్-19 సోకింది. దీంతో అతడు భారత్‌కు చేరుకోవడం కాస్త ఆలస్యం కానుంది. అతడు సోమవారం భారత్‌కు రాననున్నాడు. హెడ్ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో లక్నోతో మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నాడు. అతడు పూర్తిగా కోలుకుని తిరిగి మా తదుపరి మ్యాచ్‌కు అందుబాటులోకి వస్తాడని ఆశిస్తున్నామని" ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో వెట్టోరీ పేర్కొన్నాడు.
కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్ వారం పాటు వాయిదా పడిన విషయం విధితమే. ఈ క్రమంలో కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌తో పాటు హెడ్ తమ స్వదేశానికి వెళ్లిపోయారు. ఐపీఎల్ రీస్టార్ట్ కావడంతో కమ్మిన్స్ తిరిగి వచ్చినప్పటికి.. హెడ్ మాత్రం కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా జట్టులో చేరనున్నాడు.
ఈ సీజన్‌లో హైదరాబాద్ జట్టుకు మూడు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. సోమవారం లక్నోతో, ఆ తర్వాత ఆర్‌సీబీ, కేకేఆర్‌తో మ్యాచులు ఆరెంజ్ ఆర్మీ ఆడనుంది.
చదవండి: 'అవన్నీ రూమర్సే.. ఇంకా నిర్ణయం తీసుకోలేదు': బీసీసీఐ