
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తల కారణంగా ఆసియా క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీలకు దూరంగా ఉండాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాకిస్తాన్‌కు చెందిన మంత్రి మొహిసిన్ నఖ్వీ ఏసీసీ చైర్మెన్‌గా ఉండడంతో భారత క్రికెట్ బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
తాజాగా ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ నుండి వైదొలుగుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
"ఆసియా కప్, మహిళల ఎమర్జింగ్ జట్ల ఆసియా కప్ రెండు ఏసీసీ ఈవెంట్‌లలోనూ పాల్గొనకూడదని బీసీసీఐ నిర్ణయం తీసుకుందన్న వార్తలు మా దృష్టికి వచ్చాయి. ఈ రోజు ఉదయం నుంచి ఇదే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ నిరాధరమైన వార్తలు. బీసీసీఐ ఇప్పటివరకు తదుపరి ఏసీసీ ఈవెంట్‌లకు సంబంధించి ఎలాంటి చర్చలు జరపలేదు. అదేవిధంగా ఏసీసీకి ఎటువంటి లేఖ కూడా బీసీసీఐ రాయలేదు.
ప్రస్తుతం మా దృష్టింతా ఐపీఎల్, తదుపరి ఇంగ్లండ్ సిరీస్‌లపైనే మాత్రమే ఉంది. ఆసియా కప్ లేదా ఏదైనా ఇతర ఏసీసీ ఈవెంట్‌పైన ఎటువంటి నిర్ణయం తీసుకున్న భారత క్రికెట్ బోర్డు ప్రెస్‌నోట్ కచ్చితంగా విడుదల చేస్తోంది" అని దేవజిత్ సైకియా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవజిత్ సైకియా పేర్కొన్నారు.
కాగా మహిళల ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ వచ్చే నెలలో జరగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్‌లో పురుషుల ఆసియా కప్ టోర్నీని నిర్వహించనున్నారు. గత ఆసియాకప్ టోర్నీ శ్రీలంక, పాక్‌ల వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరిగింది.
చదవండి: IPL 2025: పాకిస్తాన్ సరసన గుజరాత్ టైటాన్స్