ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన | Australia Squad For T20 World Cup Announced; 3 RCB Players Included | Sakshi
Sakshi News home page

ప్రపంచకప్‌కు ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. ముగ్గురు ఆర్సీబీ ప్లేయర్లకు చోటు

May 13 2026 1:48 PM | Updated on May 13 2026 2:31 PM

Australia Squad For T20 World Cup Announced; 3 RCB Players Included

ఇంగ్లండ్‌ అండ్‌ వేల్స్‌ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026 కోసం క్రికెట్‌ ఆస్ట్రేలియా 15 మంది సభ్యుల పటిష్టమైన జట్టును ఇవాళ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ సోఫీ మోలినెక్స్‌ ఎంపిక కాగా.. ఆష్లే గార్డ్‌నర్‌ ఆమెకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్‌) వ్యవహరించనుంది.

ఈ జట్టులో ఎల్లిస్‌ పెర్రీ, బెత్‌ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్‌ వంటి స్టార్‌ ప్లేయర్లు కూడా చోటు దక్కించుకున్నారు. ఈసారి సెలెక్టర్లు స్పిన్ బౌలింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇంగ్లండ్ పరిస్థితులకు అనుగుణంగా జార్జియా వేర్హమ్‌, అలానా కింగ్‌ వంటి లెగ్ స్పిన్నర్లను ఎంపిక చేశారు. అయితే ఫాస్ట్‌ బౌలర్ డార్సీ బ్రౌన్‌కు ఈ జట్టులో చోటు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆమె స్థానంలో 20 ఏళ్ల యువ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ లూసీ హ్యామిల్టన్‌కు అవకాశం దక్కింది.

ఇక భారత అభిమానులకు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. డబ్ల్యూపీఎల్‌ ఫ్రాంచైజీ ఆర్సీబీకి చెందిన ముగ్గురు కీలక ప్లేయర్లకు ఈ ఆసీస్‌ ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కింది. గ్రేస్‌ హ్యారిస్‌, ఎల్లిస్‌ పెర్రీ, సోఫీ మోలినెక్స్  డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ ఆడతారు. తమ ఫ్రాంచైజీకి చెందిన ముగ్గురు ప్లేయర్లకు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కడం ఆర్సీబీ అభిమానుల్లో ఆనందం నింపింది.

జూన్‌ 12 నుంచి జూలై 5 వరకు జరిగే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా.. భారత్‌, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, నెదర్లాండ్స్‌ వంటి పటిష్టమైన జట్లతో కలిసి గ్రూప్‌-1లో ఉంది. ఆసీస్‌.. జూన్ 13న మాంచెస్టర్‌లో దక్షిణాఫ్రికాతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. అనంతరం బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, పాకిస్తాన్‌, భారత్‌తో గ్రూప్ దశ పోరాటాలు ఉంటాయి. ముఖ్యంగా జూన్ 28న లార్డ్స్ మైదానంలో భారత్‌తో జరిగే మ్యాచ్‌పై ఇప్పటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఆస్ట్రేలియా మహిళల T20 ప్రపంచ కప్ 2026 జట్టు
సోఫీ మోలినెక్స్ (కెప్టెన్), ఆష్లే గార్డ్‌నర్ (వైస్ కెప్టెన్),  తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), నికోలా క్యారీ, కిమ్ గార్త్, లూసీ హామిల్టన్, గ్రేస్ హారిస్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ (వికెట్ కీపర్), ఎలిస్ పెర్రీ, మేగన్ షుట్, అన్నబెల్ సదర్లాండ్, జార్జియా వోల్, జార్జియా వేర్‌హామ్. రిజర్వ్: తాలియా విల్సన్ (వికెట్ కీపర్).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement