Asia Cup 2022: అనుష్క ఐరన్‌ లేడీ.. కోహ్లి ఉక్కు మనిషి.. విరుష్కపై అక్తర్‌ కామెంట్లు

Asia Cup 2022: Shoaib Akhtar Says Anushka Iron Lady Kohli Man Made Of Steel - Sakshi

Asia Cup 2022 Virat Kohli Century: టీమిండియా స్టార్ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, అతడి సతీమణి, నటి అనుష్క శర్మపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అనుష్క ఐరన్‌ లేడీ.. కోహ్లి ఉక్కు మనిషి అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. కాగా గతకొన్ని రోజులుగా విమర్శల పాలైన కోహ్లి.. ఆసియా కప్‌-2022 టోర్నీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు వేయికళ్లతో ఎదురుచూసిన సెంచరీ ఫీట్‌ నమోదు చేశాడు.

దాదాపు మూడేళ్ల తర్వాత శతకం బాదాడు. సూపర్‌-4లో భాగంగా అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 61 బంతుల్లో 122 పరుగులతో అజేయంగా నిలిచి టీమిండియాను గెలిపించాడు. దీంతో రన్‌మెషీన్‌ 71వ సెంచరీ చూడాలని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన అభిమానుల నిరీక్షణకు తెరపడింది. ఇక తనకు టీ20 ఫార్మాట్లో ఇదే తొలి శతకం కావడం.. అది కూడా అత్యంత కఠిన పరిస్థితుల్లో శతకం బాదడంతో కోహ్లి సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.

వాళ్లిద్దరికీ అంకితం
అఫ్గన్‌తో మ్యాచ్‌లో ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్న అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. గడ్డు పరిస్థితుల్లో తన భార్య అనుష్క తనకు అండగా నిలిచిందని.. ఈ సెంచరీ ఆమెకు, తమ చిన్నారి కూతురు వామికాకు అంకితమిస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇక కోహ్లి వ్యాఖ్యలపై స్పందించిన రావల్పిండి ఎక్స్‌ప్రెస్‌ షోయబ్‌ అక్తర్‌.. విరుష్క జోడీని ఆకాశానికెత్తాడు.

హ్యాట్సాఫ్‌ అనుష్క!
తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘మ్యాచ్‌ తర్వాత ఇంటర్వ్యూలో విరాట్‌ కోహ్లి మాట్లాడుతూ.. ఆమె నా జీవితంలో చేదు ఘటనలను దగ్గరగా చూసింది అన్నాడు. అతడు తన భార్య గురించే ఆ మాటలు చెప్పాడు. హ్యాట్సాఫ్‌ టూ అనుష్క శర్మ.. వెల్‌డన్‌! నువ్వు ఐరన్‌ లేడీవి. అతడు ఉక్కుతో తయారైన మనిషి.. అతడెవరంటే మిస్టర్‌ విరాట్‌ కోహ్లి’’ అని అక్తర్‌ అభివర్ణించాడు.

అదే విధంగా కోహ్లి మరో 29 సెంచరీలు చేసి సచిన్‌ వంద సెంచరీల రికార్డును సమం చేస్తే చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిపోతాడని పేర్కొన్నాడు. ఇందుకోసం కోహ్లి ఎంతో సంయమనం.. సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని సూచించాడు. నువ్వు మంచివాడివి.. మంచి వాళ్లకు మంచే జరుగుతుంది అంటూ కోహ్లిపై అభిమానం చాటుకున్నాడు. కాగా ఆసియా కప్‌-2022లో భారత జట్టు కనీసం ఫైనల్‌ కూడా చేరకుండానే నిష్క్రమించింది. దుబాయ్‌ వేదికగా సెప్టెంబరు 11న శ్రీలంక- పాకిస్తాన్‌ మధ్య ట్రోఫీ కోసం పోరు జరుగనుంది.

చదవండి: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్‌ రిప్లై ఇదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top