Asia Cup 2022 Final: ఫైనల్లో నసీం షా ఇబ్బంది పెడతాడనుకుంటున్నారా? లంక ఆల్‌రౌండర్‌ రిప్లై అదిరింది! ఒక్క మాటతో..

Asia Cup: Sri Lanka Star Shuts Pakistan Reporter Over Naseem In Final Query - Sakshi

Asia Cup 2022 Final Sri Lanka Vs Pakistan: మెగా ఈవెంట్‌ ఆరంభ మ్యాచ్‌లోనే అఫ్గనిస్తాన్‌ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర ఓటమి.. బంగ్లాదేశ్‌పై గెలుపుతో విజయాల బాట పట్టి సూపర్‌-4లో అఫ్గనిస్తాన్‌, ఇండియా, పాకిస్తాన్‌ జట్లను ఓడించి.. ఫైనల్‌ వరకు అజేయ జైత్రయాత్ర... ఆసియా కప్‌- 2022 టీ20 టోర్నీలో ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన శ్రీలంక ప్రస్థానం ఇది. 

దుబాయ్‌ వేదికగా ఆదివారం(సెప్టెంబరు 11) పాకిస్తాన్‌తో జరిగే ఫైనల్‌లో టైటిల్‌ ఫేవరెట్‌గా మారింది దసున్‌ షనక బృందం. సమిష్టి కృషితో తుదిపోరుకు అర్హత సాధించి.. ఆసియా కప్‌ ట్రోఫీ లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం ఇప్పటికే లంక- పాక్‌ జట్లు సమాయత్తమవుతున్నాయి.

‘రిహార్సల్‌ మ్యాచ్‌’లో పాక్‌ను చిత్తు చేసి!
ఇక సూపర్‌- 4 ఆఖరి మ్యాచ్‌ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరిగిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన శ్రీలంక తొలుత బౌలింగ్‌ ఎంచుకుని పాక్‌ను 121 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగి 17 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ కీలక పేసర్‌ నసీమ్‌ షా లేకుండానే పాక్‌ బరిలోకి దిగింది.

కాగా షాహిన్‌ ఆఫ్రిది స్థానంలో జట్టులోకి వచ్చిన 19 ఏళ్ల నసీమ్‌ పాకిస్తాన్‌ సాధించిన విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తమకు కీలకమైన మ్యాచ్‌లో అఫ్గనిస్తాన్‌ బౌలర్లు అత్యద్భుతంగా పోరాడిన వేళ.. నసీమ్‌ ఆఖర్లో రెండు సిక్సర్లు కొట్టి అటు అఫ్గన్‌.. ఇటు టీమిండియా ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో అతడిపై అంచనాలు మరింతగా పెరిగాయి. అయితే, ఫైనల్‌కు ముందు లంకతో జరిగిన మ్యాచ్‌లో అతడికి రెస్ట్‌ ఇవ్వడం విశేషం.

నసీం షా ఉంటాడు కదా! అయితే!
ఈ నేపథ్యంలో పాక్‌పై విజయానంతరం మీడియాతో మాట్లాడిన లంక ఆల్‌రౌండర్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ వనిందు హసరంగకు నసీమ్‌ గురించి ప్రశ్న ఎదురైంది. నసీమ్‌ షా మీకు ఫైనల్లో గట్టి సవాల్‌ విసురుతాడు అని భావిస్తున్నారా అని హసరంగను ఓ పాకిస్తాన్‌ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు కూల్‌గా స్పందించిన హసరంగ.. కాస్త గ్యాప్‌ ఇచ్చి.. ‘‘అదేదో ఫైనల్లోనే చూసుకుంటాం’’ అని చిరునవ్వులు చిందించాడు. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. హసరంగ చర్యపై ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘‘బిల్డప్‌ చూసి ఏం చెబుతావో అనుకున్నాం... కానీ.. ఒక్క మాటతో పరోక్షంగా నసీం షా గాలి తీసేశావు’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
చదవండి: కోహ్లి, రోహిత్‌ కాదు.. టీమిండియా వైఫల్యానికి ప్రధాన కారణం ఇదే!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top