Asia Cup 2022 Super 4: పాక్‌తో మ్యాచ్‌.. మూడు మార్పులతో బరిలోకి దిగనున్న టీమిండియా..!

Asia Cup 2022 IND VS PAK Super 4: Team India Playing XI - Sakshi

India Playing 11: ఆసియా కప్‌ సూపర్‌-4 దశలో భాగంగా రేపు (సెప్టెంబర్‌ 4) భారత్‌-పాకిస్తాన్‌ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇరు జట్లు ఇదివరకే గ్రూప్‌ దశలో ఓసారి ఎదురెదురు పడగా.. ఆ మ్యాచ్‌లో టీమిండియా పాక్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన నాటి మ్యాచ్‌లో హార్ధిక్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో ( (18 బంతుల్లో 32 నాటౌట్‌;  3 వికెట్లు) చెలరేగడంతో భారత్‌ అపురూప విజయం సాధించింది. 

హాంగ్‌ కాంగ్‌పై గెలుపుతో గ్రూప్‌-ఏ నుంచి సూపర్‌-4 రెండో బెర్తును ఖరారు చేసుకున్న పాక్‌.. ఈ దశలో ఎలాగైనా భారత్‌ను మట్టికరించి గ్రూప్‌ స్టేజ్‌లో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. మరోవైపు టోర్నీలో ఇదివరకే పాక్‌ను దెబ్బకొట్టిన ఆత్మవిశ్వాసంతో టీమిండియా సైతం ఉరకలేస్తుంది. ఇక పాక్‌తో మ్యాచ్‌కు టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. 

హాంగ్‌ కాంగ్‌పై ఆడిన రిషబ్‌ పంత్‌, గాయం కారణంగా టోర్నీని నుంచి వైదొలిగిన జడేజా, అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేని ఆవేశ్‌ ఖాన్‌ స్థానాల్లో హార్ధిక్‌ పాండ్యా, దీపక్‌ హుడా, రవిచంద్రన్‌ అశ్విన్‌లు జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ తప్పనిసరిగా మూడో స్పెషలిస్ట్‌ పేసర్‌ అవసరం అనుకుంటే ఆవేశ్‌ ఖాన్‌కు మరో అవకాశం ఇచ్చే అంశాన్ని పరిశీలించవచ్చు. దుబాయ్‌ పిచ్‌ పేసర్లకు అనుకూలించే అవకాశాలు ఉండటం, జట్టులో ఆవేశ్‌ ఖాన్‌కు ప్రత్యామ్నాయం లేకపోవడంతో అతన్నే మరోసారి రంగంలోకి దించే అవకాశాలు లేకపోలేదు.  

మరోవైపు వికెట్‌కీపర్‌గా డీకేనా.. లేక పంతా అన్న డిస్కషన్‌ కూడా టీమిండియా యాజమాన్యాన్ని సందిగ్ధంలో పడేసింది. టాస్‌ గెలిచిన జట్టు ఛేజింగ్‌కే మొగ్గు చూపే అవకాశం ఉండటంతో ఫినిషర్‌ పాత్రలో కార్తీక్‌నే కొనసాగించవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఓపెనర్లు కెప్టెన్‌ రోహిత్‌, కేఎల్‌ రాహుల్‌ స్థానాలకు ఎటువంటి ఢోకా లేదు. ఆతర్వాతి స్థానాల్లో విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌, రిషబ్‌ పంత్‌/ దినేశ్‌ కార్తీక్‌, దీపక్‌ హుడా, హార్ధిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌/ అశ్విన్‌, చహల్‌, అర్షదీప్‌ బరిలోకి దిగే అవకాశం ఉంది. కాగా, సూపర్‌-4 దశకు భారత్‌, పాక్‌తో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్‌ జట్లు చేరుకున్న విషయం తెలిసిందే. 

భారత్ తుది జట్టు(అంచనా)..
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషబ్‌ పంత్‌/ దినేశ్‌ కార్తీక్‌, దీపక్‌ హుడా, హార్ధిక్‌ పాండ్యా, భువనేశ్వర్‌ కుమార్‌, ఆవేశ్‌ ఖాన్‌/ అశ్విన్‌, చహల్‌, అర్షదీప్‌
చదవండి: కోహ్లి ఎప్పటికీ రోహిత్‌ లేదంటే సూర్యకుమార్‌ కాలేడు: పాక్‌ మాజీ కెప్టెన్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top