సూపర్‌ ఓవర్‌ ఓటమిపై కుంబ్లే రియాక్షన్‌ | Sakshi
Sakshi News home page

సూపర్‌ ఓవర్‌ ఓటమిపై కుంబ్లే రియాక్షన్‌

Published Mon, Sep 21 2020 4:01 PM

Anil Kumble Reacts After Super Over Loss To Delhi Capitals - Sakshi

దుబాయ్‌:  ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా రెండో మ్యాచే సూపర్‌ ఓవర్‌కు దారి తీయడం లీగ్‌పై ఆసక్తిని అమాంతం పెంచేసింది. ఆదివారం కింగ్స్‌ పంజాబ్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తించింది. చివరకు ఆ మ్యాచ్‌ సూపర్‌ వరకు వెళ్లడం అందులో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించడం జరిగింది. సూపర్‌ ఓవర్‌లో కింగ్స్‌ పంజాబ్‌ రెండు పరుగులే చేసి రెండు వికెట్లు కోల్పోవడంతో వారి ఇన్నింగ్స్‌ ఇంకా బంతులు ఉండగానే ముగిసింది. సూపర్‌ ఓవర్‌లో ఏ జట్టైనా రెండు వికెట్లు కోల్పోతే అక్కడితో వారి ఇన్నింగ్స్‌కు తెరపడుతోంది. కింగ్స్‌ పంజాబ్‌ జట్టులో రాహుల్‌ రెండు పరుగులే చేసి ఔట్‌ కాగా, ఆపై వెంటనే పూరన్‌కు పెవిలియన్‌ చేరాడు.

ఇలా సూపర్‌ ఓవర్‌లో ఒక జట్టు రెండు పరుగులే నిర్దేశించిన సందర్భాలు చాలా అరుదు.  దాంతో కింగ్స్‌ పంజాబ్‌ ఓటమి ముందే డిసైడ్‌ అయిపోయింది. ఆ రెండు పరుగుల్ని ఢిల్లీ సునాయాసంగా సాధించడంతో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ ఓటమిపై కింగ్స్‌ పంజాబ్‌ హెడ్‌కోచ్‌ అనిల్‌ కుంబ్లే మాట్లాడుతూ.. ‘ ఇది చాలా నిరాశ కల్గించింది. మ్యాచ్‌ ఆద్యంత ఆకట్టుకుని చివరకు ఇలా దారుణంగా ఓటమి  పాలు కావడం బాధించింది. మేము మ్యాచ్‌ గెలవాల్సింది. కానీ చేజేతులా చేసుకున్నాం. ఇది నిజంగా దురదృష్టమే.  మ్యాచ్‌ ఎప్పుడైతే సూపర్‌ ఓవర్‌కు దారి తీసినప‍్పుడు మేము కనీసం 10-12 పరుగులు చేస్తే బాగుండేది. కానీ అలా జరగలేదు. ఢిల్లీ ఓటమి అంచుల నుంచి బయటకొచ్చి గెలుపును అందుకుంది. ఇక్కడ ఢిల్లీని అభినందించాలి. ఇది మాకు ఫస్ట్‌గేమ్‌ కాబట్టి చేసిన పొరపాట్లను గుణపాఠం నేర్చుకుంటాం. ఓవరాల్‌గా చూస్తే మా ఆట బాగుంది. వచ్చే గేమ్‌నాటికి అన్నీ సర్దుకుంటాయి అని ఆశిస్తున్నా’ అని కుంబ్లే తెలిపాడు.(చదవండి: కోహ్లి.. నీకు అర్థమవుతోందా..?)

Advertisement
Advertisement