
కింగ్‌స్టన్ (జమైకా): అంతర్జాతీయ టి20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ తన కెరీర్‌లో 84 మ్యాచ్‌లలో వెస్టిండీస్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 163.08 స్ట్రైక్‌రేట్‌తో 1078 పరుగులు చేసిన అతను విండీస్ రెండు టి20 వరల్డ్ కప్ విజయాల్లో (2012, 2016) భాగంగా ఉన్నాడు. తన కెరీర్ విశేషాల గురించి చెబుతూ అతను తన అత్యుత్తమ మ్యాచ్ గురించి ప్రస్తావించాడు.
2016 వరల్డ్ కప్‌లో భాగంగా ముంబైలో జరిగిన సెమీ ఫైనల్ పోరు తన ‘బెస్ట్’ అని అతను వెల్లడించాడు. వాంఖెడే మైదానంలో జరిగిన ఈ పోరులో ముందుగా భారత్ 192 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో రసెల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ సమయంలో విండీస్ విజయానికి 41 బంతుల్లో 77 పరుగులు అవసరం కాగా...20 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో అజేయంగా 43 పరుగులు చేశాడు.
కోహ్లి వేసిన చివరి ఓవర్లో వరుసగా ఫోర్, సిక్స్ బాది అతను మ్యాచ్‌ను ముగించాడు. ఫైనల్ చేరిన విండీస్ ఆపై ఇంగ్లండ్‌ను ఓడించి రెండో సారి ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ‘నిస్సందేహంగా భారత్‌తో సెమీస్ మ్యాచే నా కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన. 190 పరుగుల లక్ష్యం...సొంతగడ్డపై ఆడుతున్న భారత్‌కే ప్రేక్షకుల నుంచి పూర్తి మద్దతు ఉంది. తీవ్ర ఒత్తిడి మధ్య బరిలోకి దిగా. అయితే పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉండటంతో నా ప్రణాళిక ప్రకారం చెలరేగి జట్టును గెలిపించా’ అని రసెల్ గుర్తుచేసుకున్నాడు.