పృథ్వీ షాను ఆపతరమా!

All eyes on Prithvi Shaw as Mumbai take on Uttar Pradesh - Sakshi

నేడు విజయ్‌ హజారే టోర్నీ ఫైనల్లో ముంబైతో ఉత్తరప్రదేశ్‌ ‘ఢీ’

ఉదయం 9 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

న్యూఢిల్లీ: ఈ సీజన్‌ విజయ్‌ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్‌ టోర్నీ అంటేనే బాగా గుర్తుకువచ్చే ప్రదర్శన పృథ్వీ షాదే. ఈ ముంబై కుర్రాడు దేశవాళీ టోర్నీలో (105 నాటౌట్, 227 నాటౌట్, 185 నాటౌట్, 165)... ఇలా ‘శత’చితగ్గొట్టి 754 పరుగులు చేశాడు. ఇలాంటి విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ ఫైనల్లో మాత్రం ఊరుకుంటాడా! అందుకే ఆదివారం జరిగే ఫైనల్లో ఉత్తరప్రదేశ్‌కు అతని రూపంలో పెద్ద సవాల్‌ ఎదురవుతోంది. ముంబై జట్టునంతటిని ఎదుర్కోవడం కంటే పృథ్వీ షాను నిలువరించడంపైనే దృష్టి పెట్టింది. ఆస్ట్రేలియా పర్యటనలో వైఫల్యం దరిమిలా ఫిట్‌నెస్‌ సమస్యలతో తీవ్ర ఒత్తిడిలోకి కూరుకుపోయిన పృథ్వీ షా విజయ్‌ హజారే టోర్నీని తన పునరాగమన వేదికగా చేసుకున్నట్లున్నాడు. అందుకే ఎదురైన ప్రత్యర్థులపై చెలరేగిపోయాడు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌ (యూపీ) కోచ్‌ జ్ఞానేంద్ర పాండే మార్గదర్శనంలో జట్టు నిలకడైన విజయాలతో మూడోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. యువ కెప్టెన్‌ కరణ్‌ శర్మ జట్టును నడిపిస్తున్న తీరు బాగానే ఉన్నా... ముంబై ఓపెనర్‌ కట్టడే లక్ష్యంగా ఫైనల్‌ బరిలోకి దిగాల్సి ఉంది. కెప్టెన్‌తో పాటు వికెట్‌ కీపర్‌ ఉపేంద్ర యాదవ్, అ„Š దీప్‌ నాథ్‌ ఈ జాతీయ టోర్నీలో ఆకట్టుకున్నారు. యూపీ బౌలర్లు శ్రమించి పృథ్వీ షాతో పాటు యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్, ఆదిత్య తారేలను తక్కువ స్కోర్లకే అవుట్‌ చేస్తే ఫామ్‌లో ఉన్న యూపీ బ్యాట్స్‌మెన్‌ పరుగుల నావను నడిపించగలరు. ఏదేమైనా నేటి ఫైనల్లో ముంబై జట్టే ఫేవరెట్‌గా కనిపిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top