SA20 2023: మార్కరమ్‌ సూపర్‌ సెంచరీ.. ఫైనల్‌కు చేరిన సన్‌రైజర్స్

Aiden Markrams century guides Sunrisers Eastern Cape to final - Sakshi

సౌతాఫ్రికా టీ20 లీగ్‌-2023 ఫైనల్లో సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ జట్టు అడుగు పెట్టింది. గురువారం సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో సెమీ ఫైనల్లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌ను 14 పరుగుల తేడాతో ఓడించి ఫైనల్‌బెర్త్‌ను సన్‌రైజర్స్‌ ఖారారు చేసుకుంది. సన్‌రైజర్స్‌ ఫైనల్‌కు చేరడంలో ఆ జట్టు కెప్టెన్‌ ఐడెన్ మార్కరమ్‌ కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో మార్కరమ్‌ అద్భుతమైన సెంచరీతో చెలరేగాడు. కేవలం 58 బంతులు ఎదుర్కొన్న మార్కరమ్‌  6 సిక్స్‌లు, 6 ఫోర్లుతో 100 పరుగులు చేశాడు. అతడితో పాటు జోర్డాన్ హెర్మాన్ 48 పరుగులతో రాణించాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌లు ఫలితంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన  సన్‌రైజర్స్‌ ఈస్టర్న్ కేప్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. కాగా జోబర్గ్ సూపర్ కింగ్స్‌ బౌలర్లలో విలియమ్స్‌ నాలుగు వికెట్లు సాధించాడు.

పోరాడి ఓడిన సూపర్ కింగ్స్‌
214 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు మాత్రమే చేయగల్గింది. దీంతో విజయానికి 14 పరుగుల దూరంలో సూపర్‌ కింగ్స్‌ నిలిచిపోయింది. సన్‌రైజర్స్‌ జట్టులో రోలోఫ్ వాన్ డెర్ మెర్వే రెండు వికెట్లు, మగాల, జానెసన్‌, బార్ట్‌మాన్‌ తలా వికెట్‌ సాధించారు.

ఫైనల్లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఢీ
జోహన్నెస్‌బర్గ్ వేదికగా ఫిబ్రవరి 11న జరగనున్న ఫైనల్‌ పోరులో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ తలపడనుంది. తొలి సెమీఫైనల్లో పార్ల్‌ రాయల్స్‌ను చిత్తు చేసి ప్రిటోరియా ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
చదవండిWomens T20 WC: ధనాధన్‌ ఆటకు అమ్మాయిలు సిద్ధం.. హర్మన్‌ప్రీత్ సేన ఈసారైనా...!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top