IPL 2023: వాళ్లిద్దరే మా ఓటమిని శాసించారు.. లేదంటేనా! చాలా బాధగా ఉంది: మార్‌క్రమ్‌

Aiden Markram comments After SRHs Crushing Loss Against RCB - Sakshi

ఐపీఎల్‌-2023 సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తీరుమారలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ మరో ఓటమి చవి చూసింది. ఉప్పల్‌ వేదికగా గురువారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఎస్‌ఆర్‌హెచ్‌ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో రాణించినప్పటికీ.. బౌలింగ్‌లో మాత్రం పూర్తిగా తేలిపోయింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌.. క్లాసెన్‌ సెంచరీతో చెలరేగడంతో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. అనంతరం 187 లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.

ఆర్సీబీ బ్యాటర్లలో విరాట్‌ కోహ్లి(100) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్‌ డుప్లెసిస్‌(71) పరుగులతో రాణించాడు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ మార్‌క్రమ్‌ స్పందించాడు. ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన క్లాసెన్‌పై మార్‌క్రమ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు.

"ఈ మ్యాచ్‌లో మేము బ్యాటింగ్‌ బాగానే చేశాం. అయితే పవర్‌ప్లేలో కొన్ని కీలకమైన పరుగులు చేయలేకపోయాం. క్లాసెన్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు సంచలన ఇన్నింగ్స్‌ కారణంగా మేము మంచి స్కోర్‌ సాధించగలిగాం.  ఐపీఎల్‌లో  క్లాసెన్‌ సెంచరీ సాధిస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. ఉప్పల్‌లో మాకే కాదు ఆర్సీబీకి కూడా ఫ్యాన్స్‌ సపోర్ట్‌ చేశారు.

ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్‌కు విజయాన్ని అందించకపోవడం చాలా బాధగా ఉంది. ఇక ఫాప్‌, కోహ్లి అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అదే మా ఓటమిని శాసించింది. మా జట్టు బౌలింగ్‌ విభాగంలో కొంతమంది యువ క్రికెటర్లు ఉన్నారు. వారు ఇప్పుడిప్పుడే సరైన ట్రాక్‌లో పడుతున్నారు.

పవర్‌ప్లేలో మేము భారీగా పరుగులు సమర్పించుకున్నాం. కార్తీక్ త్యాగి ఒత్తిడికి గురయ్యాడు. మా ప్లాన్స్‌ను అమలు చేయడంలో విఫలమయ్యాం. మయాంక్ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక ఆఖరి మ్యాచ్‌లో గెలిచి టోర్నీని విజయంతో ముగించాలని భావిస్తున్నాం" అని పోస్ట్‌మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో మార్‌క్రమ్‌ పేర్కొన్నాడు.
చదవండి: Virat Kohli: గేల్‌ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top