'సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే' | Aakash Chopra Opines On CSKs Playoff Chances After Defeat Against Lucknow Super Giants | Sakshi
Sakshi News home page

IPL 2026: 'సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌ చేరడం కష్టమే'

May 16 2026 8:12 PM | Updated on May 16 2026 9:16 PM

Aakash Chopra Opines On CSKs Playoff Chances After Defeat Against Lucknow Super Giants

ఐపీఎల్‌-2026లో శుక్ర‌వారం ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మి చ‌విచూసిన చెన్నై సూపర్ కింగ్స్.. త‌మ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌ను సంక్లిష్టం చేసుకుంది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌ 188 పరుగుల లక్ష్యాన్ని కేవ‌లం 16.4 ఓవర్లలోనే ఛేదించడం ద్వారా సీఎస్‌కే పాయింట్ల ప‌ట్టిక‌లో ఆరో స్ధానానికి ప‌డిపోయింది.

ఇప్ప‌టివ‌ర‌కు 12 మ్యాచ్‌లు ఆడిన సీఎస్‌కే.. ఆరింట గెలుపొందగా, మరో ఆరింట ఓటమి పాలైంది. చెన్నై జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి.

సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌లలో భారీ తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇతర జట్ల మ్యాచ్‌ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సీఎస్‌కే ప్లేఆఫ్ అవకాశాలపై భారత మాజీ క్రికెటర్‌ ఆకాష్ చోప్రా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. సీఎస్‌కేకు చివ‌రి రెండు మ్యాచ్‌ల‌లో క‌ఠిన స‌వాల్ ఎదురుకానంద‌ని చోప్రా తెలిపాడు.

"చెన్నై సూప‌ర్ కింగ్స్  గరిష్టంగా 16 పాయింట్లకు చేరుకునే అవకాశం ఉంది. కానీ  ఆ మార్కును అందుకోవాలంటే వారు ఆడబోయే తదుపరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాలి. ఏ ఒక్క మ్యాచ్‌లో ఓడినా టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది. గ‌త మ్యాచ్‌లో ఘోర ఓట‌మి కార‌ణంగా నెట్ రన్ రేట్ కూడా ప‌డిపోయింది. 

అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల‌లో సీఎస్‌కేకు గెల‌వ‌డం అంత సులువు కాదు. ఈ సీజ‌న్‌లో ఇప్పటివరకు ఏ పై జట్లనైతే ఓడించలేకపోయారో, ఇప్పుడు ప్లేఆఫ్స్ చేరాలంటే ఖచ్చితంగా ఆ పై జట్లనే ఇప్పుడు త‌ప్ప‌క గెల‌వాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డంది. గుజ‌రాత్‌, హైద‌రాబాద్‌ల నుంచి మ‌రోసారి గ‌ట్టి పోటీ చెన్నైకి ఎదురు కావ‌డం ఖాయ‌మ‌ని" చోప్రా త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో పేర్కొన్నాడు. సీఎస్‌కే మే 18న ఎస్‌ఆర్‌హెచ్‌, మే 21న గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది.
 

Advertisement
 
Advertisement
Advertisement