5 నెలల గర్భవతి... 10 కి.మీ. పరుగు... 62 నిమిషాల్లో...

5-month pregnant woman finishes TCS World 10K Run - Sakshi

బెంగళూరు: మహిళా‘శక్తి’ అంటే ఇదేనేమో! పురుషులు ఏ కొంచెం ఎక్కువ శ్రమించినా బాగా అలసిపోయాం... ఇక విశ్రాంతి కావాల్సిందే అంటారు. కానీ మహిళ మాత్రం ఓ బిడ్డను మోస్తున్నా ఇంటి పని చేస్తుంది. ఆఫీస్‌కెళ్లి డ్యూటీ చేస్తుంది. అంతేగానీ... నెలతప్పిన నాటి నుంచి ప్రసవించే దాకా రెస్ట్‌ తీసుకుంటానని భీష్మించుకోదు కదా! ఇదే జరిగితే మన పొద్దు గడవడం కాదు... ప్రపంచమే నడవకుండా ‘లాక్‌డౌన్‌’ అయ్యేది. ఇక విషయానికొస్తే... ఓ మహిళ మరో అడుగు ముందుకేసింది. స్ఫూర్తిగొలిపే పరుగు పెట్టింది. ఐదు నెలల గర్భవతి అయిన ఆమె 10కే (10 కిలోమీటర్లు) పరుగును 62 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆ ధీర వనిత బెంగళూరుకు చెందిన 35 ఏళ్ల అంకిత గౌర్‌.

వృత్తిరీత్యా ఇంజినీర్‌ అయిన అంకిత గత తొమ్మిదేళ్లుగా ఇలాంటి పరుగు పోటీల్లో పాల్గొంటూనే ఉంది. ఇక టీసీఎస్‌ 10కే రన్‌లో 2013 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా పోటీ పడుతూనే ఉంది. ఇందులో విశేషం లేదు. కానీ ఇప్పుడామె 5 నెలల గర్భవతి. మరో మూణ్నాలుగు నెలల్లో అంకిత తల్లి కానుంది. అయినా సరే తనకిష్టమైన పరుగు కోసం తన గైనకాలజిస్టును సంప్రదించి మరీ పోటీపడింది. దీనిపై అంకిత మాట్లాడుతూ ‘గడిచిన తొమ్మిదేళ్లుగా ఈ ‘పరుగు’ పెడుతూనే ఉన్నాను. నిత్యం నేను తీసుకునే శ్వాసలాగే నా జీవితంలో నేను పెట్టే పరుగు ఓ భాగం’ అని వివరించింది. ప్రతిరోజూ తను రన్నింగ్‌ చేస్తూనే ఉంటానని చెప్పిన ఆమె ఐదు అంతర్జాతీయ మారథాన్‌లలోనూ పాల్గొన్నట్లు పేర్కొంది. బెర్లిన్‌లో మూడుసార్లు, బోస్టన్, న్యూయార్క్‌ మారథాన్‌లలో ఒక్కోసారి పోటీపడినట్లు తెలిపింది. గతంలో టీసీఎస్‌ 10కేలోనూ పతకాలు గెలిచానని వివరించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top