ప్రజలకు తప్పని తిప్పలు ఆర్‌టీసీ బస్టాండ్లు, రోడ్లు, యూజీడీ తదితర పనుల్లో ఇష్టారాజ్యం మిగతా వాటిల్లోనూ లోపాలే.. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో దుస్థితి
అభివృద్ధి పనులన్నీ లోపభూయిష్టం
అభివృద్ధికి నమూనాగా ఊదరగొట్టిన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో భారీ అభివృద్ధి పనుల్లో ముందుచూపులేక.. పట్టణ ప్రజలకు ప్రస్తుతం అవస్థలు తప్పడం లేదు. కేసీఆర్ సీఎంగా
ఉన్నంతకాలం.. ఈ మున్సిపాలిటీకి నిధుల వరద పారింది. ఈ నిధులతో చేపట్టిన పనులను భవిష్యత్ అవసరాలకనుగుణంగా తీర్చిదిద్దడంలో అధికారులు విఫలమవడం అనర్థాలను తెచ్చిపెడుతోంది. ఆర్‌టీసీ బస్టాండ్లు, రోడ్లు, యూజీడీ ఇలా ఎన్నో పనుల్లో ప్రమాణాలకు పాతరేశారు. – గజ్వేల్
నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న కేసీఆర్ 2014 నుంచి 2023వరకు సీఎంగా పనిచేశారు. ఈ సమయంలో నియోజకవర్గకేంద్రమైన గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలోనే రోల్‌మోడల్‌గా నిలబెట్టాలనుకున్నారు. ఈ క్రమంలో అడిగిందే తడవుగా నిధులిచ్చారు. ఈ నిధులతో ఎన్నో భారీ అభివృద్ధి పనులు జరిగాయి, కానీ ఆయా పనుల్లో భవిష్యత్తుపై దృష్టి, ప్రమాణాల్లేక ప్రస్తుతం జనం ఇబ్బందిపడుతున్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ప్రధాన రోడ్డు ఆధునీకరణకు పదేళ్ల క్రితం సుమారుగా రూ.45 కోట్ల వరకు వెచ్చించారు. ఈ రోడ్డుపై పలు చోట్ల అండర్‌పాస్‌లు, బ్రిడ్జిలను నిర్మించాల్సిన ఉండగా.. వాటిని డిజైన్‌లో మరిచిపోయారు. ఫలితంగా ఈ రోడ్డుకు ఏటా వరద ముప్పు తప్పడం లేదు.
యూజీడీ డిజైన్‌లోనూ లోపాలు
గజ్వేల్ పట్టణంలో రూ.156 కోట్ల వ్యయంతో నిర్మించిన యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రైనేజీ)లోనూ డిజైన్ లోపాలు పట్టణ ప్రజలకు శాపంగా మారాయి. పట్టణం వేగంగా విస్తరిస్తుండగా.. భవిష్యత్తు అవసరాలకనుగుణంగా ఈ వ్యవస్థను తీర్చిదిద్దలేదు. పట్టణంలోని మురుగును శుద్ధి చేయడానికి నాలుగు చోట్ల నిర్మించిన ఎస్‌టీపీ (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్)ల సామర్థ్యం సరిపోవడం లేదు. ఫలితంగా ట్రీట్‌మెంట్ చేయకుండానే మురుగును చెరువుల్లోకి వదులుతున్నారు. ఫలితంగా పట్టణంలోని పలు చెరువులు మురికి కూపంగా మారాయి. ఇకపోతే భారీ వర్షాలు కురిసి వరద వచ్చే సందర్భాల్లో పట్టణంలోని యూజీడీ చాంబర్‌లు పొంగిపోర్లుతున్నాయి. దీంతో మురుగంతా వీధుల్లో పారుతుండటం.. దుర్గంధం వ్యాపిస్తుండటంతో జనం అవస్థలు పడుతున్నారు. మరోవైపు యూజీడీ లీకేజీ వల్ల పట్టణంలోని చెరువులు, కుంటల్లోకి మురుగు చేరుతుంది.
మహతి ఆడిటోరియంనూ..
ఇవేకాకుండా.. పట్టణంలోని మహతి ఆడిటోరియంను సరైన పార్కింగ్ ఏర్పాట్లు లేకుండా నిర్మించారు. ఫలితంగా వేలాదిమంది ఇక్కడ జరిగే కార్యక్రమాలకు హాజరయ్యే సందర్భంలో ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. పక్కనున్న శీతలీకరణ కేంద్రాన్ని వేరేచోటుకు మార్చి...ఆ స్థలాన్ని పార్కింగ్ తీసుకోవాలని ప్రతిపాదించారు. కానీ అమల్లోకి రాలేదు. ఇలా చెపుకుంటూపోతే ఇక్కడ జరిగిన ప్రతి పనిలోనూ ఏదోలోపం బయటపడుతూనే ఉంది. ఇప్పటికై నా ఈ లోపాలను సరిచేయడానికి ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాల్సి ఉంది.
పనుల్లో ప్రమాణాలకు పాతర


