చేర్యాల(సిద్దిపేట): పట్టణ పరిధిలోని బీడీ కాలనీలో చీటీల పేరుతో సుమారు రూ.1.50 కోట్లు మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్నేళ్లుగా చీటీలు నిర్వహించిన ఒక వ్యక్తి డబ్బులు చెల్లించకుండా ఐపీ నోటీసులు పంపడంతో బాధితులు ఆందోళనకు దిగారు. సుమారు 50 మంది చీటీలు వేయగా, 28 మందికి నోటీసులు పంపినట్లు బాధితులు తెలిపారు. తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేస్తూ నిర్వాహకుడి ఇంటి ఎదుట నిరసన తెలిపారు.
బోగస్ బిల్లులతో
డబ్బులు స్వాహా!
హుస్నాబాద్‌రూరల్: పంచాయతీ వార్డు సభ్యుల శిక్షణ నేపథ్యంలో బోగస్ బిల్లులు సృష్టించి అధికారులు డబ్బులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 17 గ్రామాల పంచాయతీల వార్డు సభ్యులకు గతంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరువాత సభ్యులకు ధ్రువీకరణ పత్రాలను సైతం ఇచ్చారు. అయితే ఇదే సమయంలో సహస్ స్వచ్ఛంద సంస్థ.. స్వచ్ఛతపై వార్డు సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించింది. ఈ సంస్థ ఏర్పాటు చేసిన భోజనాలనే వార్డు సభ్యులకు అధికారులు వడ్డించినట్లు సమాచారం. సుమారు 17 గ్రామాల వార్డు సభ్యులకు శిక్షణ సమయంలో భోజనాల కోసం ప్రభుత్వం మొదటి విడత రూ.97,000, రెండో విడత రూ.98,000 బిల్లులు మంజూరు చేసింది. ఓ హోటల్ నుంచి బోగస్ బిల్లులు తెప్పించి డబ్బులు కాజేసినట్లు కొందరు అధికారులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎంపీడీఓ సురేశ్‌ను వివరణ కోరగా నేను విధుల్లో చేరకముందే వార్డు సభ్యులకు గత ఇన్‌చార్జి ఎంపీడీఓ శిక్షణ ఇచ్చారని వివరించారు.
మల్లన్న ఆలయంలో
భక్తుల సందడి
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లన్న ఆలయం ఆదివారం భక్తులరాకతో సందడిగా మారింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి భక్తులు తరలి వచ్చి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. స్వామివారికి అభి షేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారిని కరీంనగర్ ఏసీపీ సతీశ్‌కుమార్ కుటుంబ సమేతంగా దర్శంచుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఏర్పాట్లను ఆలయ అధికారులు, ప్రధానార్చకులు మహాదేవుని మల్లికార్జున్‌లు పర్యవేక్షించారు.
4న జిల్లా స్థాయి
క్రికెట్ పోటీల ఎంపిక
చిన్నకోడూరు(సిద్దిపేట): సిద్దిపేట టీ–10 క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 4న చిన్నకోడూరులోని మినీ స్టేడియంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు సంఘం కార్యదర్శి మహేష్ తెలిపారు. ఆసక్తిగల వారు ఆధార్ కార్డు జిరాక్స్, క్రికెట్ కిట్లు తీసుకురావాలని సూచించారు. ఎంపికైన వారు తర్వలో జరిగే రాష్ట్ర స్థాయి క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. ఆసక్తిగల వారు 8919833851 నంబర్‌ను పంప్రదించాలన్నారు.
టీఎన్జీవో అధ్యక్ష,
కార్యదర్శుల నియామకం
సిద్దిపేటజోన్: నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్(టీన్జీఓ) జిల్లా నూతన అధ్యక్షుడిగా పరమేశ్వర్, ప్రధాన కార్యదర్శిగా విక్రమ్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం ఎన్జీవో భవన్‌లో రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ సమక్షంలో నూతన కమిటీ ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న వారే తిరిగి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్వర్ వారిని అభినందించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష,కార్యదర్శులు మాట్లాడుతూ.. సంఘం బలోపేతానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో టీన్జీఓ అసోసియేట్ ప్రెసిడెంట్ సురేందర్ రెడ్డి, కోశాధికారి లింగంతో పాటు నాయకులు పాల్గొన్నారు.


