కార్పొరేట్‌ కళాశాల | - | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ కళాశాల

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

తెరవెనుక చేతులు మారుతున్న లక్షల రూపాయలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘన తెలిసినా పట్టించుకోని ఇంటర్‌ బోర్డు అధికారులు

సాక్షి, సిద్దిపేట: ఇంటర్మీడియెట్‌ బోర్డు నూతన కళాశాలలకు గత ఐదేళ్ల నుంచి అనుమతులు నిలిపివేసింది. విద్యారంగాన్ని వ్యాపారమయం చేసిన కార్పొరేట్‌ కాలేజీ యాజమాన్యాలు ఇప్పుడు నూతన కళాశాలలను నెలకొల్పేందుకు కొత్తపంథాను ఎంచుకుంటున్నాయి. ఇందులో భాగంగా గతంలో అనుమతులు పొందిన కాలేజీలకు తమ పేర్లను తగిలించుకుంటున్నాయి. పైకి కళాశాల పేరు మార్చినా దీని వెనుక క్రయ విక్రయాలు జోరుగా సాగిస్తున్నాయి. అయితే కాలేజీలను అమ్మడం గానీ, కొనుగోలు చేయడం కానీ చేయకూడదని నిబంధనలు స్పష్టంగా చెబుతున్నా వాటిని ఉల్లంఘించి మరీ కార్పొరేట్‌ కాలేజీలు జిల్లాలో ఉన్న చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలను గుట్టుగా కొనేస్తున్నాయి. ఇటీవలే జిల్లాలో ‘కొత్త తరం’ఇంటర్‌ కాలేజీ (పేరు మార్చాం)ని కొనుగోలు చేసి ఓ సంఖ్యను సూచించేలా పేరు మార్చారు. అయితే ‘కొత్త తరం’కాలేజీ యాజమాన్యం కూడా గతంలో ఓ కాలేజీని ఇలాగే కొనుగోలు చేసింది. మరో కళాశాల కార్పొరేట్‌ పేరుతో కోచింగ్‌ సెంటర్‌ను సైతం ప్రారంభించింది. ఇలా వరుసగా కళాశాలల పేర్లు, యాజమాన్యాలు మారిపోతున్నాయి.

మూతపడే స్థితికి చిన్న చిన్న ప్రైవేటు కాలేజీలు

జిల్లా వ్యాప్తంగా 25 ప్రైవేట్‌, 83 ప్రభుత్వ రంగ జూనియర్‌ కళాశాలలు ఉండగా అందులో దాదాపు 20వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలల ప్రవేశంతో బడ్జెట్‌ కళాశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో బడ్జెట్‌ కళాశాలలను యాజమాన్యాలు నడపలేని, మూతపడే స్థితికి చేరుకుంటున్నాయి. దీన్ని అదనుగా తీసుకుంటున్న కార్పొరేట్‌ కళాశాలలు చిన్నా చితకా ప్రైవేటు కళాశాలలను యథేచ్ఛగా కొనేస్తున్నాయి.

కార్పొరేట్‌కు బోర్డు ప్రోత్సాహం!

బడ్జెట్‌ కళాశాలలను డీలా చేసి కార్పొరేట్‌ కళాశాలను ఇంటర్‌ బోర్డు ప్రోత్సహిస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు. బడ్జెట్‌ కళాశాలలు సామాన్యులకు అందుబాటులో ఫీజులను వసూలు చేసేవి. కార్పొరేట్‌ కళాశాలలైతే రూ.లక్షల ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఇప్పటికై నా ఇంటర్‌ బోర్డు ఉన్నతాధికారులు దృష్టి సారించి కళాశాలల విక్రయాలను నియంత్రించాలని విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

పట్టించుకోని అధికారులు

బడ్జెట్‌ కళాశాలలు ఇష్టారాజ్యంగా పేర్లు మార్చుకుంటూ, విక్రయాలు జరుపుతున్నా ఇంటర్‌ బోర్డు అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకు పేరు మార్చాలనుకుంటున్నారు? ఎందుకు తరలిస్తున్నారు? ఫర్మ్‌ ఎందుకు మార్చుకుంటున్నారని పరిశీలించకుండానే దరఖాస్తు రాగానే ఎలా కావాలంటే అలా బోర్డు అధికారులు చకచకా పనులు చేస్తున్నారు.

గుట్టుగా చేతులు మారుతున్న లక్షల రూపాయలు

కార్పొరేట్‌ స్థాయిలో కళాశాలలను స్థాపించాలనుకునే అంతంతమాత్రంగా సాగుతున్న కళాశాలలను సంప్రదించి వాటిని గుట్టుగా కొనుగోలు చేసి పేర్లను మారుస్తున్నాయి. దీని వెనుక రూ.లక్షలు చేతులు మారతున్నాయి. ఇంటర్‌ బోర్డు నిబంధనల్లో పేరు మార్చుకునే, స్థలం మార్చుకునే అవకాశం ఉండటంతో వాటిని ఆసరాగా చేసుకుని కార్పొరేట్‌ కళాశాలలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు చెందిన కళాశాలలు హైదరాబాద్‌ సైతం షిఫ్ట్‌ అవుతున్నాయి.

కాలేజీల పేరు మార్పు వెనుక జోరుగా క్రయ విక్రయాలు

జిల్లా పరిధిలో పేరు మార్పునకు ఓకే

ఒకే జిల్లా, మండల పరిధిలో మాత్రమే పేరు మార్పునకు, తరలింపునకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన తర్వాతే వాటికి అనుమతులిస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా నిబంధనల ప్రకారమే చేస్తున్నాం. ప్రభుత్వ అనుమతి పొందిన కళాశాలలో మాత్రమే విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవాలి. అనుమతి లేకుండా కళాశాలను నడిపిస్తే చర్యలు తీసుకుంటాం.

–రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్మీడియెట్‌ విద్యాశాఖ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement