బడికి తాళం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే.. | - | Sakshi
Sakshi News home page

బడికి తాళం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే..

Feb 23 2026 9:17 AM | Updated on Feb 23 2026 9:17 AM

బడికి తాళం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే..

బడికి తాళం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యమే..

జబ్బాపూర్‌ స్కూల్‌ ఘటనపై డీఈఓ వివరణ

వర్గల్‌(గజ్వేల్‌): అద్దె చెల్లింపులో కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, యజమాని అత్యుత్సాహం కారణంగానే వర్గల్‌ మండలం జబ్బాపూర్‌ ‘బడికి తాళం’ ఘటన చోటుచేసుకుందని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. ‘అద్దె చెల్లించలేదని.. బడికి తాళం’ శీర్షికతో ఆదివారం ‘సాక్షి’ మెయిన్‌ఎడిషన్‌లో కథనం ప్రచురితమైన విషయం పాఠకులకు విదితమే. బడికి తాళం వేసిన ఘటనపై ‘సాక్షి’తోపాటు వివిధ పత్రికలలో కథనాలు రావడంతో ఆదివారం జిల్లా విద్యాధికారి స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. జబ్బాపూర్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో నూతన భవన నిర్మాణం కోసం 2024 మార్చి 14న స్పెషల్‌ డెవెలప్‌మెంట్‌ ఫండ్‌ నిధుల ద్వారా రూ. 60 లక్షలు మంజూరయ్యాయని తెలిపారు. 2025 జూలై 7న పాఠశాల విద్యాకమిటి సమావేశంలో నూతన భవన నిర్మాణం కోసం శిథిలభవనం కూల్చివేసి, తాత్కాలికంగా అద్దె ఇంటిలో స్కూల్‌ నిర్వహించాలని, కాంట్రాక్టర్‌ ద్వారా నెలకు రూ.3000 అద్దెచెల్లించాలని నిర్ణయించారు. ప్రస్తుతం నూతన భవన నిర్మాణపనులు బేస్మెంట్‌ స్థాయికి చేరాయని, ఆగస్టు 1 నుంచి పాఠశాల అద్దెగదిలో కొనసాగుతుండగా, కాంట్రాక్టర్‌ రెండు నెలలు మాత్రమే అద్దె చెల్లించినట్లు పేర్కొన్నారు. దీంతో శనివారం పోషకుల సమావేశం సందర్భంగా మిగతా నాలుగు నెలల అద్దె కోసం ఇంటి యజమాని నిరసన వ్యక్తం చేస్తూ బడికి తాళం వేశారని, తల్లిదండ్రులు, సర్పంచ్‌ వెంకటేశ్‌ స్పందించి అద్దె చెల్లించేందుకు అంగీకరించడంతో 15 నిమిషాలలోనే తాళం తెరిచి యదావిధిగా పాఠశాల కొనసాగించారన్నారు. కేవలం కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, యజమాని అత్యుత్సాహం వల్ల విద్యార్థులకు అసౌకర్యమేర్పడిందని వివరించారు. ఈ విషయం జిల్లా యంత్రాంగం దృష్టికి రాగానే భవన నిర్మాణం పూర్తయ్యేవరకు ప్రభుత్వ నిధుల నుంచి అద్దె చెల్లించేలా కలెక్టర్‌ ఏర్పాటు చేశారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement