ఇవి కూరలేనా?
● విద్యార్థులకు ఇలాగేనా వడ్డించేది
● కలెక్టర్ హైమావతి ఆగ్రహం
● బాధ్యులపై చర్యలకు ఆదేశం
దుబ్బాక: ‘ఇవి కూరలా?.. ఇది సాంబారా?.. ఇంత అధ్వానమా.. విద్యార్థులకు భోజనాలు ఇలాగేనా పెట్టేది.. పైగా అరకొర వండి వడ్డించడమా?’ అంటూ కలెక్టర్ హైమావతి మండిపడ్డారు. శనివారం దుబ్బాక మండలంలోని రామక్కపేటలో బాలికల గురుకులాన్ని, కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వండిన కూరలన్నీ నాసిరకంగా ఉండటం.. పైగా అరకొరగా వండటంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరకులు, కూరగాయలన్నీ అందిస్తుంటే పిల్లలకు మెనూ ప్రకారం నాణ్యమైన కూరలతో వడ్డించకుండా ఇంత నాసిరకంగా భోజనాలు పెడతారా? అంటూ కేర్ టేకర్, ఉపాధ్యాయులపై మండి పడ్డారు.
అరకొరగా వడ్డించడంపై..
గురుకులంలో 500పైగా పిల్లలుంటే 237 మంది విద్యార్థులకు కూడా సరిపోకపోవడంతో ఎందుకిలా సగం కడుపుకే పెడుతున్నారంటూ కలెక్టర్ హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాక్ రిజిష్టర్ తనిఖీ చేయగా రాసిన సరకులకు చేసిన వంటలకు పొంతన లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇంత అధ్వానంగా భోజనం పెడుతున్న కేర్ టేకర్‌తో పాటు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని జోనల్ అధికారిని ఫోన్‌లో ఆదేశించారు. విద్యార్థులకు భోజనం, చదువు, వసతి విషయంలో రాజీపడొద్దని ప్రభుత్వం అందిస్తున్న ఫలాలను చేరవేయడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు.


