బీఆర్‌ఎస్‌కు ఓట్ల సునామీ
బీజేపీకి ఓట్లు 11.45 శాతానికే పరిమితం దుబ్బాక, గజ్వేల్, చేర్యాలలో కాంగ్రెస్ వెనుకబాటు బీఆర్‌ఎస్ కంచుకోటను కదిలించలేక పోయిన కాంగ్రెస్
సాక్షి, సిద్దిపేట: బీఆర్‌ఎస్ పురిటిగడ్డలో పట్టణ ఓటర్లు కారు వైపే మొగ్గు చూపారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో మూడు చోట్ల బీఆర్‌ఎస్, ఒక చోట కాంగ్రెస్ అత్యధిక కౌన్సిలర్లు గెలుపొందారు. అయినప్పటికీ మొత్తం ఓటర్ల పరంగా చూస్తే కాంగ్రెస్ కంటే బీఆర్‌ఎస్‌కే 2.3శాతం మంది అధికంగా ఓట్లు వేశారు. ఆయా మున్సిపాలిటీలలో ఇండిపెండెంట్లు సాధించిన ఓట్లు సైతం కొన్ని చోట్ల బీజేపీ, కాంగ్రెస్‌లు సాధించలేకపోయాయి.
జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో 83,116 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందులో బీఆర్‌ఎస్‌కు 33,760 (40.61 శాతం), కాంగ్రెస్‌కు 31,855(38.32), బీజేపీకి 9,520 (11.45 శాతం) ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ అధికారంలోకి ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్ కంచుకోటలో మాత్రం తన ప్రభావం చూపలేకపోయింది. జిల్లాలో కేంద్ర, రాష్ట్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గజ్వేల్ నుంచి మాజీ సీఎం, ప్రతిపక్ష నేత కె.చంద్రశేఖర్ రావు, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి టి.హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో జనం బీఆర్‌ఎస్‌కే అండగా నిలిచారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరంగా చూస్తే 19 పురపాలికలలో 4,12,109 ఓట్లు పోలు కాగా 11 మున్సిపాలిటీలలో గులాబీ పార్టీకి, మరో 8 చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం లభించింది. ఓటర్ల పరంగా కాంగ్రెస్‌కు (1,60,199 (38.87 శాతం), బీఆర్‌ఎస్ 1,50 582 (36.53 శాతం), బీజేపీ 47,540 (11.53 శాతం) సాధించాయి.
దుబ్బాకలో కాంగ్రెస్ వెనకబాటు
దుబ్బాక పట్టణంలో వచ్చిన ఓట్ల పరంగా చూస్తే బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్‌కు 2వేలకు పైగా ఓట్లు తక్కువగా వచ్చాయి. దుబ్బాక పట్టణంలో పలు చోట్ల ఇండిపెండెంట్లకు వచ్చిన ఓట్లు సైతం కాంగ్రెస్ అభ్యర్థులు సాధించలేకపోయారు. చేర్యాల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు కేవలం 225 ఓట్ల తేడా మాత్రమే ఉంది. పుర పీఠం బీఆర్‌ఎస్‌కే దక్కింది. చేర్యాల మున్సిపాలిటీలో 12 వార్డులలో కలిపి బీజేపీకి కేవలం 125 ఓట్లు మాత్రమే సాధించింది. అలాగే గజ్వేల్‌లో బీఆర్‌ఎస్ కంటే కాంగ్రెస్ 2,226 ఓట్లు తక్కువగా వచ్చాయి. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ లోకసభ నియోజకవర్గం పరిధిలోని హుస్నాబాద్ పట్టంలో కేవలం 1,487 మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు.
మున్సిపాలిటీ బీఆర్‌ఎస్ కాంగ్రెస్ బీజేపీ
చేర్యాల 5,500 (47.69 శాతం) 5,275 (45.74) 125 (1.08 శాతం)
దుబ్బాక 6,526 (35.89 శాతం) 4,403 (24.21) 3,487 (19.17శాతం)
గజ్వేల్ 16,208 (43.65 శాతం) 13,982 (37.65) 4,421 (11.9శాతం)
హుస్నాబాద్ 5,526 (33.95 శాతం) 8,195 ( 50,35) 1,487 ( 9.13 శాతం)
కంగుతిన్న బీజేపీ
12 వార్డుల్లో 125 ఓట్లు
చేర్యాల(సిద్దిపేట): చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటలేకపోయింది. పట్టణ పరిధిలో 12 వార్డుల్లో బీజేపీకి వచ్చిన మొత్తం ఓట్ల సంఖ్యను చూసి పుర ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 12 వార్డుల్లో తమ పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. సుమారు 30 మంది రాష్ట్ర పార్టీ నుంచి పరిశీలకులు వచ్చి పట్టణంలో ఉండి మరీ ప్రచారం చేశారు. అయినా వారు గెలువకపోగా కనీసం గెలుపు, ఓటములను ప్రభావితం చేయలేకపోయారు. పోటీ చేసిన 12 వార్డుల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. అన్ని వార్డుల్లో కలిపి మొత్తం 125 ఓట్లు, పోలైన వాటిలో 1.08శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉండి, ప్రధాని మోదీ నాయకత్వంలో బలమైన పార్టీగా అవతరిస్తున్నామని చెప్పుకునే బీజేపీ నాయకులకు ఈ ఫలితాలు గట్టి షాక్ ఇచ్చాయి.


