సిద్దిపేట అభివృద్ధిని అడ్డుకుంటుండ్రు
● కాంగ్రెస్, బీజేపీలది ఓర్వలేనితనం
● మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సిద్దిపేట అభివృద్ధిని అన్ని విధాలుగా అడ్డుకుంటున్నదని, బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన నిధులను వెనక్కి తీసుకొని పగబట్టిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ భవన్‌లో బీజేపీ నాయకులు హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు రాజకీయంగా లబ్ధిపొందేందుకు మంత్రులు, ఎంపీలు సిద్దిపేట అభివృద్ధిని చూసి బీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారన్నారు. నాడు తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట కేంద్రం బిందువుగా మారిందన్నారు. గతంలో ఎక్కడ చూసినా సిద్దిపేట పట్టణం చెత్త చెత్తగా కనిపించేదని, పట్టణ ప్రజల సహకారంతో, బీఆర్‌ఎస్ హయాంలో మహా నగరాల్లో లేని యూజీడీతో పాటు, పట్టణానికి నలుదిక్కులా పచ్చదనంతో స్వాగతం పలికేలా ఎంతో అభివృద్ధి చేశామన్నారు. జిల్లాలో సాగు, తాగునీటి సమస్య లేకుండా గోదావరి నీరు తెచ్చామన్నారు. తాగునీటికి ఇబ్బంది కలగకుండా 50 ఏళ్ల ముందుచూపుతో రింగు మెన్‌ను నిర్మించుకున్నామన్నారు. సిద్దిపేటకు రైలు రావడం ఓ కళని, బీఆర్‌ఎస్ హామంలో నిజం చేసుకున్నామని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రైల్వే పనులన్ని నిలిపివేసిందన్నారు. ఉత్తర భారతదేశానికి సిద్దిపేట నుంచి ప్రయాణ సౌకర్యం ఉండేలా తనవంతుగా కృషి చేస్తానన్నారు. రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇక్కడికి వచ్చే నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దని, వారి అవసరాలు తీరిపోయాక మిమ్మల్ని ఎవరూ పట్టించుకోరన్నారు. ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలపై త్వరలోనే వీడియోలను విడుదల చేస్తానని, ప్రజలకు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, సిద్దిపేటను అందరి సహకారంతో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.
చదువుతోపాటు క్రీడలు అవసరం
సిద్దిపేటజోన్: చదువుతో పాటు క్రీడలు సైతం ఎంతో ముఖ్యమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని క్రికెట్ స్టేడియంలో ట్రెస్మా ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. శారీరక మానసిక ప్రశాంతతకు క్రీడలు ఎంతో అవసరమన్నారు. అందరూ క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. మన ఆరోగ్యమే నేటి మన విజయమన్నారు. ఆన్ లైన్ గేమ్స్, ఏఐలాంటి యాప్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. చిన్నతనంలోనే క్రీడలు, వ్యాయామం ఒక దినచర్యగా మార్చుకోవాలి సూచించారు.


