రిజర్వేషన్లపైఉత్కంఠ
‘మున్సిపల్’లో ఆశావహుల ఎదురుచూపు వార్డు స్థానాలపైనా సర్వత్రా చర్చ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నేడు ఖరారు
సాక్షి, సిద్దిపేట: మున్సిపల్ ఎన్నికలకు ఓ వైపు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తుంటే.. మరోవైపు రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ చైర్మన్, వార్డుల రిజర్వేషన్లపై ఆశావహులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నాలుగు మున్సిపాలిటీల పాలక వర్గం గతేడాది ముగిసింది. మున్సిపాలిటీల వారీగా ఎవరికి ఎన్ని సీట్లు అనేది ఇప్పటికే మున్సిపల్ శాఖ ప్రకటించింది. ఇందుకు ఏ వార్డు.. ఏ రిజర్వేషన్ అనేది ప్రకటించనున్నారు. ఇందుకోసం శనివారం జిల్లా కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీలతో కలెక్టర్ సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఆయా పార్టీల ప్రతినిధుల ఎదుటే మహిళ, జనరల్ స్థానాలకు సంబంధించి డ్రాను తీయనున్నారు.
బీసీలకు తగ్గిన సీట్లు
2020లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన రిజర్వేషన్లతో పోలిస్తే ఈ సారి బీసీలకు దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలలో సీట్లు తగ్గాయి. చేర్యాల మున్సిపాలిటీలో గతంలో బీసీలకు నాలుగు వార్డులు కేటాయిస్తే ఇప్పుడు మూడు వార్డులు, అలాగే దుబ్బాకలో గతంలో 7 వార్డులు కేటాయిస్తే తాజాగా ఆరు వార్డులు మాత్రమే కేటాయించారు. హుస్నాబాద్‌లో గతంలో ఐదు వార్డులు ఇప్పుడు సైతం ఐదు వార్డులనే, గజ్వేల్‌లో 2020లో 7వార్డులు కేటాయించగా ఇప్పుడు సైతం ఏడు వార్డులను బీసీలకు కేటాయించారు. చేర్యాల, దుబ్బాక మున్సిపాలిటీలలో అన్ రిజర్వ్‌కు ఒక్కోక్కటి చొప్పున పెరిగాయి.
నేడు తేలనున్న రిజర్వేషన్లు
కొన్ని రోజులుగా కౌన్సిలర్‌గా పోటీ చేయాలనుకున్నవారు, చైర్మన్ గిరీని దక్కించుకోవాలనుకున్న ఆశావహుల్లో టెన్షన్ శనివారంతో తెలిపోనుంది. గత ఏడాదిగా నాలుగు మున్సిపాలిటీలు ప్రత్యేక పాలనలో కొనసాగుతున్నాయి. 2020లో గజ్వేల్(జనరల్), హుస్నాబాద్(జనరల్ మహిళ), దుబ్బాక (జనరల్ మహిళ), చేర్యాల (జనరల్ మహిళ)లకు రిజర్వేషన్ కాగా ఈ సారి ఏ రిజర్వేషన్ వస్తుందో అని చైర్మన్ గిరిని ఆశిస్తున్న వారు టెన్షన్ పడుతున్నారు. వార్డు ఏ రిజర్వేషన్ వస్తుందో అని కొన్ని రోజులు ఆశావహులు ఎదురుచూస్తున్నారు. ఆయా వార్డుల వారీగా ఏ వార్డు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, అన్ రిజర్వ్‌కు కేటాయించాలనే దానిపై ఇప్పటికే ఆయా మున్సిపల్ కమిషనర్లు పూర్తి చేసినట్లు తెలిసింది. శుక్రవారం ఉదయం నుంచి కలెక్టరేట్‌లో రిజర్వేషన్ల కసరత్తు పూర్తి చేసి కలెక్టర్‌కు జాబితాను అప్పగించినట్లు సమాచారం. శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లో అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో మహిళలకు కేటాయించే వార్డులకు సంబంధించి డ్రాను తీయనున్నారు. అనంతరం రిజర్వేషన్లకు సంబంధించి ఉత్తర్వులను కలెక్టర్ జారీ చేయనున్నారు.
నిబంధన మేరకు పురపాలికల్లో 50శాతం సీట్లు మహిళలకు కేటాయిస్తారు. జనరల్‌తోపాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ స్థానాలు కూడా ఖరారు చేసి మహిళలకు కేటాయిస్తారు. ఈ క్రమంలో గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలలో కొందరు ఆశావహులు, మాజీ కౌన్సిలర్లు ఇప్పటికే తామున్న వార్డుల్లో బరిలో దిగుతున్నట్లు ఓటర్లకు తెలిసేందుకు ప్రధాన జంక్షన్లలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. రిజర్వేషన్ల స్థానాన్ని పురుషులకు కేటాయిస్తే వారే రంగంలో ఉండనున్నారు. లేకుంటే వారి భార్యలు పోటీలో ఉండనున్నారనే ప్రచారం సాగుతోంది.


