ఆయుష్ సేవలు చేరువ చేయండి
సిద్దిపేటరూరల్: ఆయుష్ (ఆయుర్వేద, యునానీ, హోమియోపతి) వైద్య సేవలు ప్రజలకు చేరువయ్యేలా పనిచేయాలని కలెక్టర్ హైమావతి ఆయుష్ డాక్టర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలలో ఆయుష్ వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయుష్ కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్, ఫార్మాసిస్ట్ ఖాళీల లిస్ట్ తయారుచేయాలన్నారు. జిల్లాలో నిర్మించిన యోగా షెడ్లలో ఉపాధ్యాయులు తప్పనిసరిగా ప్రజలకు యోగా సేవలు అందించాలన్నారు. కాళ్లు, చేతులు నొప్పులతో బాధపడే వృద్ధులను ఆయుష్ వైద్యం వైపు మళ్లించేందుకు ప్రోత్సహించాలన్నారు. సిద్దిపేట పట్టణంలోని 50 పడకల ఆయుష్ ఆస్పత్రిని ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధనరాజ్, జిల్లా ఆయుష్ ప్రోగ్రామ్ మేనేజర్ భాను తేజ, జిల్లా ఆయుష్ ఇన్‌చార్జి అధికారి ఉమాదేవి, వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
గురుకులాల్లో మౌలిక వసతులు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గురుకులాల్లో నాణ్యమైన విద్యతో పాటుగా భోజనం, వసతి, తదితర మౌలిక సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కలెక్టర్ హైమావతి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మైనారిటీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్ల వెబ్‌సైట్, వాల్ పోస్టర్‌ను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో బ్యాక్‌లాగ్ అడ్మిషన్లు తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, గురుకులాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ హైమావతి
వైద్యాధికారులకు ఆదేశం


