కళాశాలల్లో డిజిటల్ బోధన
సిద్దిపేటఎడ్యుకేషన్: ప్రభుత్వ జూనియర్ కళాశాలలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. జిల్లాలోని 20 ప్రభుత్వ కాలేజీల్లో డిజిటల్ బోధన అందించేందుకు చర్యలు చేపట్టారు. అందుకు అవసరమైన నిధులను కేటాయించి ఆయా కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పిస్తోంది. ఇప్పటికే కళాశాలలకు వైట్‌వాష్, విద్యుత్ వైరింగ్, ప్రయోగ శాలలకు అవసరమైన పరికరాల కొనుగోళ్లు, మరమ్మతులు వంటి పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే అన్ని కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వాటిని హైదరాబాద్ ఇంటర్‌బోర్డులోని కమాండ్ కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ముఖ గుర్తింపు పద్ధతి (ఎఫ్‌ఆర్‌ఎస్)ను అమలు చేయడంతో సమయ పాలన సరిగ్గా అమలవుతోంది.
ఒక్కో కళాశాలకు నాలుగు చొప్పున..
జిల్లాలోని 20 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాలుగు చొప్పున మొత్తం 80 ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఆధునిక సాకేంతికతతో కూడిన ఈ ఏర్పాట్లు విద్యార్థుల అభ్యాసానికి కొత్త దిశను చూపనున్నాయి. డిజిటల్ స్క్రీన్ల ద్వారా పాఠ్యాంశాలను వీడియోలు, యానిమేషన్‌లు, గ్రాఫిక్స్ రూపంలో చూపించడంతో విద్యార్థులకు పాఠాలు సులభంగా అర్థమవుతాయి. ముఖ్యంగా గణితం, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రం వంటి క్లిష్టమైన సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలను విజువల్ పద్ధతిలో నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది.
విద్యుత్, ఇంటర్నెట్..
ఒక్కో కళాశాలకు రూ. 6లక్షలకు పైగా వెచ్చిస్తున్నారు. అధ్యాపకుని కేంద్రంగా ఇంటరాక్టీవ్ బోధన కోసం రెండు ఐఎఫ్‌బీ స్క్రీన్లు, విద్యార్థుల విజువల్ లర్నింగ్‌కు ఉపయోగ పడేలా మరో రెండు ఐడీపీ మొత్తం నాలుగు స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఇందుకోసం అవసరమైన విద్యుత్, ఇంటర్నెట్, సౌండ్ సిస్టమ్ వంటి వసతులను అప్‌గ్రేడ్ చేయనున్నారు.
బోధనలో సౌలభ్యం..
ఎల్‌ఈడీ స్క్రీన్ల వినియోగంతో అధ్యాపకులకు బోధన మరింత సులభంగా మారనుంది. డిజిటల్ కంటెంట్, ప్రజెంటేషన్లు, ఆన్‌లైన్ విద్యావనరులను నేరుగా తరగతిగదిలో ఉపయోగించవచ్చు. ఒకే పాఠాన్ని అన్ని తరగతుల విద్యార్థులకు ఒకేలా బోధించే అవకాశం ఉండటం, నాణ్యత పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. గ్రామీణ ప్రాంతా పేద విద్యార్థులు సైతం కార్పొరేట్ స్థాయి బోధను అందేలా ఈ కార్యక్రమం ఉపయోగ పడనుంది. ఎల్‌ఈడీ స్క్రీన్ల ఏర్పాటు విద్యారంగంలో కీలకమైన ముందడుగా భావిస్తున్నారు.
జిల్లాలోని 20 ప్రభుత్వ కాలేజీల్లో
నిర్వహణ
ఎల్‌ఈడీ స్క్రీన్లు ఏర్పాటు
కార్పొరేట్‌కు దీటుగా..
ప్రభుత్వ కళాశాలలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నారు. అందులో భాగంగా ప్రభుత్వం మౌలిక వసతలతో పాటు ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. దీంతో విద్యార్థులు నాణ్యమైన విద్య అందుతుంది. ఫిజిక్స్ వాలా, ఖాన్‌అకాడమీ, క్లాట్ తదితరాలతో పోటీ పరీక్షల్లో సైతం విజయాలు సాధించేందుకు అవకాశం. అధ్యాపకులు, విద్యార్థులు చక్కగా వినియోగించుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలి.
– రవీందర్‌రెడ్డి, జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ)
కళాశాలల్లో డిజిటల్ బోధన


