విద్యాధరికి భక్తజనాదరణ
వర్గల్(గజ్వేల్): ఆలయ సముదాయం, సౌకర్యాల సమాహారంతో భక్తజనాదరణ చూరగొంటున్న వర్గల్ విద్యాధరి క్షేత్రం ప్రముఖ క్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోందని భారత ప్రభుత్వ అదనపు సంచాలకులు డాక్టర్ సంతోష్ కుమార్ పాండే అన్నారు. సంక్రాంతి పర్వదినం రోజు ఆయన క్షేత్రం సందర్శించి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. శేషవస్త్రం, జ్ఞాపికను అందజేసి సత్కరించారు.
గుగ్గిల్ల గ్రామాభివృద్ధికి
నిధులివ్వండి
బెజ్జంకి(సిద్దిపేట): మండలంలోని గుగ్గిల్ల గ్రామాభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కోరారు. ఈ మేరకు గ్రామస్తులు శుక్రవారం కేంద్ర మంత్రిని కరీంనగర్‌లో కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, పనులకు నిధులు ఇవ్వాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మహిపాలరెడ్డి, సర్పంచ్ మల్లయ్య, కొండాపూర్ సర్పంచ్ అజయ్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్‌లో
ప్రవేశాలకు దరఖాస్తులు
గజ్వేల్‌రూరల్: పట్టణంలోని బాలికల ఎడ్యుకేషన్ హబ్‌లోగల మోడల్‌స్కూల్‌లో 6వ తరగతిలో చేరేందుకు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వన్నెసా శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీలోగా 6వ తరగతి నుంచి 10వ తరగతిలో అభ్యసించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఏప్రిల్ 19న ప్రవేశ పరీక్ష ఉంటుందని, ఓసీలు రూ. 200, బీసీ, ఎస్సీ, ఎస్టీలు రూ.125 చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
రేపటి నుంచి
ఉర్స్ ఏ షరీఫ్ ఉత్సవాలు
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని ఆస్తాన– ఏ– నాయబి పీఠంలో ఆదివారం నుంచి ఉర్స్– ఏ– షరీఫ్ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పీఠాధిపతి హకీం షరీఫ్ చిష్తీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలు, క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హకీం షరీఫ్ మాట్లాడుతూ ఆదివారం గంధారాధన, సోమవారం దీపారాధన, మంగళవారం సమాప్తారాధన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
‘బహుజనుల కోసం
పోరాడేది బీఎస్పీయే’
సిద్దిపేటకమాన్: బహుజనుల కోసం పోరాడేది బహుజన్ సమాజ్ పార్టీ మాత్రమేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ అన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయవతి జన్మదిన వేడుకలను సిద్దిపేట పట్టణంలో బీఎస్పీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. మాయవతిని భావి భారత ప్రధాని చేయడమే తమ లక్ష్యమని తెలిపారు. బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసం పోరాడేది బహుజన్ సమాజ్ పార్టీ అని అన్నారు. కార్యక్రమంలో శ్రీనివాస్, మోహన్, హరిలాల్, భాను తదితరులు పాల్గొన్నారు.
విద్యాధరికి భక్తజనాదరణ
విద్యాధరికి భక్తజనాదరణ


