ప్రజా సంక్షేమానికే ప్రాధాన్యం
దుబ్బాకలో రూ.10 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం సిద్దిపేటలోనూ రూ.15 కోట్లతో త్వరలో పనులు జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
సిద్దిపేటరూరల్: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, గనులశాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి వివేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ తల్లి విగ్రహం ప్రతీకగా నిలుస్తుందన్నారు. అర్హులందరికీ అందేలా సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్నారు. ఇచ్చిన ఆరు గ్యారంటీలే కాకుండా ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, సన్నబియ్యం పంపిణీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయన్నారు. దుబ్బాక పర్యటనలో భాగంగా రూ.10కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. త్వరలోనే సిద్దిపేట పట్టణంలో రూ.15 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. కలెక్టర్ నేతృత్వంలో ప్రజలందరికీ సంక్షేమ పథకాలు వేగంగా చేరుకునేలా అధికార యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, ఆర్టీఏ కమిటీ సభ్యులు సూర్యవర్మ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


