నేత్రపర్వంగా గోదా కల్యాణం
వర్గల్(గజ్వేల్): గోదా రంగనాయకుల కల్యాణంతో ఈరబాయమ్మ తోట పరవశించింది. అర్చకుల మంత్రోచ్ఛరణలు, భక్తజన హర్షధ్వానాలు, బాజాభజంత్రీల నడుమ మంగళవారం సుప్రసిద్ధ నాచగిరి క్షేత్రంలో గోదా, రంగనాయకుల కల్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ చైర్మన్ పల్లెర్ల రవీందర్‌గుప్తా, ఈఓ రంగాచారి, ధర్మకర్తలు, పురప్రముఖుల సమక్షంలో అర్చక, పురోహిత పరివారం శాస్త్రోక్తంగా అమ్మవారు, స్వామివార్లకు ఎదుర్కోలు, యజ్ఞోపవిత ధారణాది కార్యక్రమాలు నిర్వహించారు. సుమూహుర్త వేళ జిలకర బెల్లం, ముత్యాల తలంబ్రాలు, అమ్మవారికి మంగళ సూత్ర ధారణ తదితర కల్యాణ క్రతువు నిర్వహించారు. దాదాపు రెండున్నర గంటలపాటు నేత్రపర్వం చేసిన మహోత్సవాన్ని భక్తులు తిలకించి తరించారు. అనంతరం స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.


