గజ్వేల్ సమస్యలు పట్టించుకోరేం?
● కేసీఆర్ తీరుపై మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఫైర్ ● సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన
గజ్వేల్: నియోజకవర్గ సమస్యలను మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ పట్టించుకోవడం లేదని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి విమర్శించారు. మంగళవారం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డుల్లో రూ.18కోట్ల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అంతేగాకుండా మున్సిపాలిటీ పరిధిలోని క్యాసారంలో ఇందిరమ్మ ఇంటిని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. జీత భత్యాల కోసం మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్ళి సంతకం పెట్టివస్తున్నారని చెప్పారు. పదేళ్లుగా గజ్వేల్‌లో ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నా వాటిని పట్టించుకోవడం లేదన్నారు. మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యల పరిష్కారానికి తాము కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గజ్వేల్‌లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి సానుకూలంగా ఉన్నారని చెప్పారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి, గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు అశోక్‌రెడ్డి, నాయకులు మొనగారి రాజు, నక్క రాములుగౌడ్, సుఖేందర్‌రెడ్డి, మతిన్ తదితరులు పాల్గొన్నారు.


