యూరియా కొరత లేదు
● రైతులు అధైర్య పడొద్దు ● కలెక్టర్ హైమావతి
మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులు అధైర్య పడొద్దని కలెక్టర్ హైమావతి తెలిపారు. మంగళవారం మండల కేంద్రమైన మిరుదొడ్డిలోని రామాంజనేయ ఫర్టిలైజర్ దుకాణా న్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా సరఫరాలో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అంటూ నేరుగా రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాసంగి సీజన్‌లో రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎకరానికి రెండు బస్తాల చొప్పున యూరియా పంపిణీ చేయాలని, కౌలు రైతులకు సైతం యూరియా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తుల పరిశీలన, ఎలక్ట్రోరల్ మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. అలాగే మిరుదొడ్డి పీహెచ్‌సీ కేంద్రాన్ని సందర్శించి రికార్డులను, ఓపీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ గంగుల గణేశ్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎంపీఓ ఫహీం. పీహెచ్‌సీ డాక్టర్ సమీనా సుల్తానా, వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


