ఉన్నట్టా.. లేనట్టా!
సిద్దిపేట మున్సిపాలిటీలో వార్డుల పునర్విభజన జరిగేనా?
జిల్లాలోని ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన సిద్దిపేటలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక పాలకవర్గం గడువు మూడు నెలలే ఉండటంతో వార్డులపునర్విభజన అంశం తెర మీదకు వచ్చింది. ఈక్రమంలో విభజన ఉన్నట్లా.. లేనట్లా అన్న అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. వార్డుల పునర్విభజన జరిగి నాలుగేళ్లు కావడం, ప్రస్తుతం ఓటర్ల సంఖ్య భారీగా పెరగడంతో అదనపు వార్డుల అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు రాజకీయపదవులు ఆశిస్తున్న వారిలోనూ ఆశలు పెరిగాయి. – సిద్దిపేటజోన్
సిద్దిపేట బల్దియా ఏర్పడి సరిగ్గా నేటికి 72 ఏళ్లు. అప్పట్లో తహసీల్దార్ ఆధ్వర్యంలో లోకల్ ఫండ్‌గా పరిగణించి 1954లో మున్సిపల్‌గా ఆవిర్భావించింది. తర్వాత 1956లో 13 వార్డులతో మాజీ ఎమ్మెల్యే ఖాజా మోహినొద్దీన్ చైర్మన్‌గా తొలి పాలకవర్గం ఏర్పడింది. తర్వాత 1981లో పదహారు వార్డులుగా మారింది. సిద్దిపేట పట్టణ విస్తీర్ణం పెరగడంతో 1987లో 28 వార్డులుగా పునర్విభజన చేపట్టారు. అనంతరం 2005లో మళ్లీ వార్డుల్లో పునర్విభజన చేసి 34వార్డులుగా మార్చారు. తర్వాత 2021 మార్చిలో సిద్దిపేట బల్దియా సమీపంలో ఉన్న ఆరు గ్రామ పంచాయతీల విలీనంతో పునర్విభజన ప్రక్రియ తెర మీదకు వచ్చింది. ఎట్టకేలకు అప్పట్లో 43 వార్డులుగా పునర్విభజన జరిగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కొన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య నిర్ణీత ప్రమాణాల కంటే అధికంగా ఉంది. 2021జనాభా లెక్కల ప్రకారం ఉన్న సంఖ్య కంటే 50వేల జనాభాపెరగడంతో పాటు ఓటర్ల సంఖ్య కూడా పెరిగింది. దీంతో వార్డుల పునర్విభజన అనేది తప్పనిసరి అనేది తెర మీదకు వచ్చింది.
అప్పట్లో లక్ష ఓటర్లు మాత్రమే..
2021 జనాభా లెక్కల ప్రకారం సిద్దిపేట బల్దియాలో 1,00,658 మంది ఓటర్లు ఉన్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ నాలుగేళ్ల కాలంలో జనాభా 50వేలకుపై చిలుకు పెరిగింది. అలాగే ఓటర్ల సంఖ్య 12వేలు పెరిగి.. ప్రస్తుతం మున్సిపాలిటీలో 1,12,000 మంది ఓటర్లు ఉన్నారు. పెరిగిన ఓట్ల ఆధారంగా వార్డుల్లో వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని సరిదిద్దే క్రమంలో వార్డుల పునర్విభజన తప్పనిసరి అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ప్రధానంగా ఆరు వార్డుల్లో..
అప్పట్లో బల్దియా పరిధిలో వార్డుల్లో కనిష్టంగా 2,100 గరిష్టంగా 2,560 ఓటర్లతో వార్డుల రూపకల్పన జరిగింది. కానీ ప్రస్తుతం పెరిగిన జనాభా, ఓటర్ల సంఖ్య ఆధారంగా చూస్తే పట్టణంలో ఉన్న ఆరు వార్డుల్లో లెక్కలకు పొంతన లేదు. పట్టణంలోని 1, 2, 3, 4, 15, 16 వార్డుల్లో పెద్ద ఎత్తున ఓటర్లు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా లింగారెడ్డిపల్లి, నర్సాపూర్ , ఇమాంబాద్ గ్రామాల విలీనం ప్రక్రియ సమయంలో సమీప వార్డుల్లో కలిపి వార్డులుగా పునర్విభజన జరిగింది. ఒక్క రెండవ వార్డులోనే ఏకంగా నాలుగేళ్లలో 1500 ఓటర్లు అధికంగా ఉన్నట్లు సమాచారం.
ఆశలు చిగురించేనా?
మున్సిపల్ ఎన్నికల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సిద్దిపేట బల్దియాలోని రాజకీయ నేతల్లో కొత్తగా ఆశలు చిగురుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న 43వార్డుల్లో పునర్విభజన జరిగితే అదనంగా మరో మూడు వార్డులు కొత్తగా ఆవిర్భవించే అవకాశం ఉంది. దీంతో కలిసి వచ్చే వార్డుల్లో పోటీ చేసేందుకు ఆశవహులు ప్రయత్నిస్తున్నారు. ఏది ఏమైనా పునర్విభజన ప్రక్రియ సిద్దిపేటలో జరుగుతుందా? లేదా? అనేది వేచి చూడాల్సిందే.
రాజకీయ నేతల్లో జోరుగా చర్చ
ప్రస్తుతం 43 వార్డులు
ప్రక్రియ జరిగితే మరో మూడు పెరిగే అవకాశం
మూడు నెలల్లో ముగియనున్న పాలకవర్గం గడువు
ఉన్నట్టా.. లేనట్టా!


