ఎవరికి చెప్పుకునేది?
● ఆస్పత్రికి వస్తే చెప్పులు మాయమే?
● జీజీహెచ్‌లో సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యం
సిద్దిపేటకమాన్: వైద్యం కోసం ఆస్పత్రికి వస్తే.. లోపలికి వెళ్లి బయటికి వచ్చే సరికే చెప్పులు కనిపించని దుస్థితి నెలకొంది. ఆస్పత్రి శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యమే ఇందుకు కారణమని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో నిత్యం చోటుచేసుకుంటున్నాయి. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా జనరల్ ఆస్పత్రి కొనసాగుతోంది. ఆస్పత్రిలోని పలు విభాగాల్లో ఓపీ సేవల నిమిత్తం రోజూ సుమారు 1500మందికిపైగా పేషెంట్లు వస్తుంటారు. అలాగే చికిత్స పొందుతున్న రోగుల సహాయకులు, బంధువులు సైతం వస్తుంటారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్దేశ్యంతో లోపలికి వెశ్లే సమయంలో చెప్పులు (పాదరక్షలు) బయట విడిచిపెట్టి వెళ్లేలా సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
లోపలికి వెళ్లి వచ్చే సరికే..
ఆస్పత్రి లోపలికి వెళ్లిన వారు తిరిగి బయటకు వచ్చి చూసే సరికే చెప్పులు ఉండటం లేదు. సెక్యూరిటీ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఆ చెప్పులను ఆస్పత్రి ఆవరణలో ఒక పెద్ద కుప్పలా వేస్తున్నారు. దీంతో రోగులు, వారి సహాయకులు తమ చెప్పుల కోసం గంటల తరబడి వెతుక్కోవాల్సి వస్తోంది. ఎంత వెతికినా దొరక్క పోవడంతో తీవ్ర అసహనంతో వెళ్లిపోతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వైద్య సేవల నిమిత్తం చుట్టు పక్కల గ్రామాల నుంచి పేద ప్రజలే ఎక్కువగా వస్తుంటారు. వారు ఆస్పత్రికి వచ్చి చెప్పులు పోగొట్టుకోవడంతో వారిపై ఆర్థికభారం కూడా పడుతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి చెప్పులు సక్రమంగా పెట్టేలా చర్యలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలని పలువురు కోరుతున్నారు.


