వాన
వెంటాడుతున్న
● కొనుగోలు కేంద్రాల్లో తడుస్తున్న ధాన్యం
● నేలవాలుతున్న వరి, రంగు మారుతున్న పత్తి
● జిల్లాలోని 14 మండలాల్లో 5,488 ఎకరాల్లో పంట నష్టం
సాక్షి, సిద్దిపేట: పంట చేతికొచ్చే వేళ అకాల వర్షాలతో రైతులు అరిగోసపడుతున్నారు. వరి పైర్లు నేలవాలగా, ఇంటికి చేరాల్సిన పత్తి తడిసిమద్దయి రంగు మారుతోంది. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెక్కల కష్టం చేతికి అందని పరిస్థితులతో కన్నీరు మున్నీరవుతున్నారు. అక్టోబర్ 29వ తేదీ నుంచి జిల్లాలో రోజు ఏదో ఒక చోట వర్షం పడుతోంది. జిల్లావ్యాప్తంగా 3,916 మంది రైతులకు చెందిన 5,483 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. దాదాపు 300 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసిపోయింది.
అత్యధికంగా కోహెడలో
జిల్లాలో వర్షాలకు 14 మండలాల్లో పంట నష్టం జరిగింది. పంట విక్రయించే దశలో ప్రకృతి కన్నెర్ర చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా కోహెడ మండలంలో 1,086 మంది రైతులకు చెందిన 1,895 ఎకరాల పంట నష్టం వాటిల్లింది. తర్వాత హుస్నాబాద్‌లో 1,499, నంగునూరులో 703, అక్కన్నపేటలో 551 ఎకరాల్లో రైతులు పంట నష్టపోయారు.
అవస్థలు పడలేక పచ్చి వడ్ల విక్రయం
నిమిషాల్లోనే వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటుండటంతో రైతులు అవస్థలు పడుతున్నారు. తేమ ఉండటంతో కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. దీంతో వడ్లను ఆరబెట్టేందుకు అవస్థలు పడలేక పచ్చి వడ్లనే మిల్లర్లకు విక్రయిస్తున్నారు. రైస్‌మిల్లర్లు ఇదే అదనుగా దోపిడీకి పాల్పడుతున్నారు. క్వింటాల్ వడ్లను రూ. 1,600 నుంచి రూ. 1,700లకు కొనుగోలు చేస్తున్నారు. ఇబ్బందులను అధికారులు అర్థం చేసుకొని తేమశాతంలో కొంత వెసులుబాటు కల్పించాలని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. కాగా జిల్లాలో గత 20 రోజులుగా వరి కోతలు మొదలయ్యాయి. వాతావరణ మార్పులతో కొందరు పొలాలు కోయలేకపోతున్నారు. చాలా చోట్ల వరి నేలవాలడంతో వడ్ల గొలుసులు రాలిపోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాన
వాన


