రైతులు అధైర్య పడొద్దు
వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి
వర్గల్(గజ్వేల్): రైతు దేశానికి వెన్నెముక రైతేనని అంతటి గొప్పదనం కలిగిన అన్నదాతలు అధైర్య పడి ఆత్మహత్యలకు పాల్పడొద్దని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి పేర్కొన్నారు. వర్గల్ మండలం తున్కిఖాల్సా ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు మంగళవారం ఏర్పాటు చేసిన ‘అగ్రి ఎక్స్‌పో’ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...విద్యార్థుల్లో వ్యవసాయం, పనిముట్లు, విత్తనాలు, సేంద్రియ ఎరువుల తయారీ తదితరాలపై అవగాహన కల్పించే వినూత్న కార్యక్రమం అభినందనీయమన్నారు. సాగు సేంద్రియం వైపు సాగాలని ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటు అవసరమని పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యలకు ప్రైవేటు అప్పులు, అధిక వడ్డీ కారణమని చాలా ఘటనల్లో వెల్లడైందని, మనీ లెండింగ్ లైసెన్సింగ్ విధానం మారాల్సిన అవసరముందని చెప్పారు. కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్‌ఎం కృష్ణ సౌజన్య, ఉపాధ్యాయులు శ్యామ్ రాథోడ్, పులిరాజు, మంజులరెడ్డి, విమల, రుక్మిణి శ్రీనివాస్, జరీనా, ఫర్హిన్, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు
పాఠశాల ప్రాంగణంలో నాగలి, ట్రాక్టర్, వ్యవసాయ బావి, పొలంలో మంచె, గుడిసె, ఎద్దులు, గడ్డివాము, నిచ్చెన, కొడవలి, గడ్డపార, పార, రోలు, రోకలి, కుదురు, సాగు కోసం కట్టిపెట్టిన వివిధ విత్తనాలు, పాత, కొత్త వ్యవసాయోపకరణాలను విద్యార్థులు స్టాల్స్ మాదిరి ప్రదర్శనగా ఏర్పాటు చేశారు. రైతులను గుర్తుకు తెచ్చే వస్త్రధారణలో వారు ఆయా అంశాలను వివరిస్తూ సందర్శకులకు అవగాహన కల్పించారు. ఆయా ప్రదర్శనలు నేటి తరం ఆలోచింపజేసేలా ఆకట్టుకున్నాయి.


