ఇందిరమ్మ బిల్లు రావడం లేదని..
● పంచాయతీ కార్యాలయంలో వంటావార్పు
● ఓ లబ్ధిదారుడి వినూత్న నిరసన
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందంటే సంతోషంతో ముగ్గు పోసుకొని ఇంటి నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు ఇల్లు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో నిరసనకు దిగారు. మంగళవారం హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో వంట వార్పు చేశారు. హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేశారు. జనవరిలో 135 ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో ప్రభుత్వం మంజూరు చేసింది. మొదట లబ్ధిదారులకు కొలతల నిబంధనలు చెప్పక ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్ నాయకులు ముగ్గు పోసి పనులు చేసుకోవాలని సూచించారు. మొదటి బిల్లు రూ.లక్ష మంజూరైన తర్వాత లెంటల్ లెవల్ బిల్లు దగ్గర అధికారులు కొర్రీలు పెట్టారు. 600 ఫీట్లు దాటితే బిల్లులు రావని చెప్పడంతో కొందరు ఇంటి పిల్లర్లను కూలగొట్టి స్లాబులు వేసుకున్నారు. కొందరు అప్పటికే స్లాబులు వేసుకోవడంతో వీరి సమస్యను స్థానిక నాయకులు మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం లభించడం లేదు. దీంతో తోటపల్లి లబ్ధిదారు శాతవేని ఏలేంద్ర అతని కొడుకు మహేశ్ బిల్లు రావడం లేదని అవేదనతో గ్రామ పంచాయతీ కార్యాలయంలో వంటావార్పు చేసి నిరసన తెలిపాడు.


